పంటి నొప్పులు భరించలేకపోతున్నారా..! ఈ చిట్కాలతో బాధకు చెక్‌పెట్టొచ్చు.
ఏది పడితే అది తినడం వల్లనో.. దెబ్బలు తగలడం వల్లనో పళ్లు దెబ్బతింటాయి. దీంతో ఒక్క పన్ను నొప్పి పుట్టినా ఎక్కువగా బాధ కలుగుతుంది. ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి తదితర కారణాల వల్ల ఈ నొప్పి ఏర్పడుతుంది. అయితే ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పంటి సమస్యలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. పంటి నొప్పి ప్రధాన సమస్యగా మారుతోంది. ఇదొక సామాన్యమైన రుగ్మతే అయినా..నొప్పి మాత్రం నరకయాతన అనుభవించేలా చేస్తుంది.
ఏ పని కూడా చేయలేరు. పంటి నొప్పి లేదా పంటి సంబంధిత సమస్యలు వెంటాడినప్పుడు కొన్ని సులభమైన వంటింటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. లవంగమనేది అందరికీ తెలిసిందే. తినే ఆహార పదార్ధాల రుచి పెరిగేందుకు వినియోగిస్తుంటారు. అయితే పంటి నొప్పుల్నించి ఉపశమనం పొందేందుకు లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు చేయాల్సిందిల్లా..లవంగాల నూనెను దూది సహాయంతో నొప్పి ఉన్న దంతాలకు రాసుకోవాలి.
లేదా లవంగాన్ని నేరుగా ఆ పంటి కింద పెట్టుకున్నా ఫలితముంటుంది. ఇక రెండవ చిట్కా వెల్లుల్లితో. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. ఫలితంగా పంటి సమస్యలకు వెల్లుల్లి వాడితే అన్నీ దూరమౌతాయి. వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా మెత్తగా చేసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. దీనివల్ల పంటిలోని కీటకాలు చనిపోతాయి. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మూడవది ఐస్ థెరపీ పంటి నొప్పుల్ని ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ ముక్కలతో ఉపశమనం పొందుతుంటారు.
దీనికోసం కొన్ని ఐస్ ముక్కల్ని తీసుకుని ఓ వస్త్రంలో చుట్టి దవడ దగ్గర పెట్టుకుని కాపరం చేయాలి. ఇలా చేయడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక నాలుగో చిట్కా జామాకులు. ఇది అందరికీ తెలిసిందే అయినా అద్భుతంగా పనిచేస్తుంది. జాంకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. జామాకులతో కూడా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. పంటి నొప్పులున్నప్పుడు లేత జామాకుల్ని నమిలి తింటే చాలావరకూ ఉపశమనం కలుగుతుంది. లేదా జామాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి..ఆ నీటితో మౌత్‌వాష్ చేయాలి.