లీటర్ తేలు విషం ధర రూ.84 కోట్లు, దేనికీ వాడుతారో తెలుసా..?
తేళ్ల విషంతో మందులు తయారు చేస్తారు. శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంటుందట. ఒక గ్రాము తేలు విషం 80వేల వరకు ఉంది. అంటే లీటర్ తేలు విషం ధర రూ. 80కోట్లు వరకు పలుకుతుంది. అయితే ‘డెత్‌స్టాకర్’ తేలు విషం ధర ఒక లీటర్‌కు సుమారు రూ.84 కోట్లు. ఎందుకంత ధర అంటే.. ఈ విషంలో అత్యంత అరుదైన న్యూరోట్యాక్సిన్ ఉండటం, సేకరణ అత్యంత కష్టమైన పని అవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటమే.
ఒక తేలు నుంచి ఒకసారి కేవలం 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే వస్తుంది. అంటే ఒక లీటర్ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఈ రకం తేళ్లను పెంచుతూ.. వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు. మామూలుగా తేళ్ల నుంచి విషం సేకరించడం కోసం.. మొదట వాటికి స్పల్ప స్థాయిలో కరెంట్ షాక్ ఇచ్చి, వాటి విష గ్రంధులను పరికరాలతో నొక్కుతారు.
ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తేళ్లు గాయపడటం, విష గ్రంధులు పగిలిపోవడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో మొరాకో శాస్త్రవేత్తలు తేళ్ల విషం సేకరణకోసం ఓ ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. తేళ్లను మెల్లగా పట్టుకుని, వాటి కొండిలను పరికరంలో పెడతారు. కొండిలోని విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా వాటంతట అవే విషాన్ని విడుదల చేస్తాయి. అవి గాయపడటం ఉండదు, ఎక్కువ విషం సేకరించవచ్చు.
పాములు, తేళ్ల విషంలో ఉండే న్యూరోట్యాక్సిన్లు, ఇతర రసాయన పదార్థాలు మన శరీరంలోని నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి. ఒక్కో రకం జీవిలో భిన్నమైన రసాయన పదార్థాలు ఉంటాయి. వాటితో భిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పాములు, తేళ్లు, ఇతర జీవుల విషం నుంచి సరికొత్త ఔషధాల అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ రకాల కేన్సర్లు, అధిక రక్తపోటు, గుండెపోటు, అల్జీమర్స్, పార్కిన్‌సన్స్, సుదీర్ఘకాలం బాధించే నొప్పులు వంటి సమస్యలకు పరిష్కారాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.