దేశానికి మరో మహమ్మారితో ముప్పు పొంచి ఉంది, కేంద్రప్రభుత్వం హెచ్చరికలు.
వ్యాధులు ప్రాణాలు తోడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సీజన్లో వచ్చే జ్వరాలు ఇతర జబ్బులు జనాన్ని భయపెడుతున్నాయి. భారత్ లో కరోనా మహమ్మారి పీడ వదలిందనుకుంటున్న సమయంలో జికా వైరస్ మరోసారి విజృంభించడం ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. మహారాష్ట్రలో జికా వైరస్ పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మహారాష్ట్రతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని ..కేసులు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రోజూ వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎంతో అప్రమత్తంగా ఉండాలి.
ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు వాటిని నియంత్రించే బాధ్యత క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య సంచాలకులకే ఉంటుంది. అయితే మన వద్ద ఇంతవరకు అందుకు సంబంధించిన కార్యాచరణేమీ కానరావడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల విజృంభణ మొదలైంది. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగ్యూ మరణాలు కూడా సంభవించాయి. పటిష్ట పర్యవేక్షణ లేకపోవడం తో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన ఉన్న విభాగాధిపతి లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
అందుకే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే ఫ్లేవి వైరస్. జికా ప్రధానంగా ఏడెస్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇదే దోమ కుడితే డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వైర్‌సలు కూడా సోకుతాయి. జికా సోకితే సాధారణ లక్షణాలే ఉంటాయి. ఇవి 2-7 రోజులపాటు కనిపిస్తాయి. ముఖ్యంగా జ్వరం, దద్దుర్లు, కీళ్ల నొప్పి, కండ్లకలక (ఎరుపు కళ్లు), కండరాలు, తలనొప్పితోపాటు మరికొన్ని తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. మైక్రోసెఫాలీ (పుట్టుక లోపం), గులియన్ బారే సిండ్రోమ్ (న్యూరోలాజికల్ డిజార్డర్), మెనింజైటిస్ (మెదడు, వెన్నెముక లైనింగ్ వాపు)లాంటి వాటికి కారణమౌతుంది.
దోమల వృద్ధిని నివారించడానికి ఇళ్లు, బహిరంగ ప్రదేశాల చుట్టూ నిలిచిన నీటిని తొలగించాలి. జికా కూడా లైంగికంగా సంక్రమించే అవకాశం ఉన్నందున సురక్షితమైన విధానాలను పాటించాలి. జికాకు నిర్దిష్ట చికిత్స లేదు, కానీ లక్షణాల ఆధారంగా చికిత్సను అందిస్తారు. జికా లక్షణాలు కనిపిస్తే వెంటనే సరైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని డాక్టర్‌ను సంప్రదించాలి.