సిగరెట్ అలవాటు ఉన్న అమ్మాయిల కోసమే ఈ విషయం. అసలు ఏంటో తెలిస్తే..?
సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది. పొగాకులో ఉండే ప్రధానమైన నికోటిన్ అనే రసాయన పదార్థం వ్యసనానికి కారణమైన ఉత్ప్రేరకం. ఈ అలవాటువల్ల చాలా రకాల కాన్సర్లు, హృద్రోగాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. గర్భవతులైన వారు పొగ త్రాగితే పుట్టే సంతానం లోపాలతో ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది చదువుకున్న అమ్మాయిలు ధూమపానానికి బానిసలు అవుతున్నారు.
నిప్పు నిప్పే. సిగరెట్ సిగరెట్టే. కార్పొరేట్ వాతావరణం, పాశ్చాత్య జీవనశైలి ఈ అలవాట్లకు కారణాలు కావచ్చు. కాలక్షేపంగా మొదలైనా వ్యసనంగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ఆ ప్రభావం చర్మ సౌందర్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ వల్ల పెదవులు రంగుమారిపోతాయి. ఆ ప్రభావం చిగుళ్లకూ విస్తరిస్తుంది.
ఎంత లిప్‌స్టిక్ పూసుకున్నా ఆ నలుపు కనిపిస్తూనే ఉంటుంది. నోటిచుట్టూ నిట్టనిలువునా ముడతలు వచ్చేస్తాయి. సిగరెట్‌లోని నికోటిన్ ప్రభావంతో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీంతో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి.. చర్మం కాంతిహీనం అవుతుంది. అకాల వృద్ధాప్యం వచ్చినట్టు అయిపోతుంది. వేలకువేలు పోసి బ్యూటీపార్లర్‌కు వెళ్లినా తేడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.
దీంతో భయపడిపోయి కాస్మటిక్ సర్జన్‌ను సంప్రదిస్తారు. అలాంటివారికి నా సలహా .. తక్షణం సిగరెట్ మానేయండి. సమస్య తొలిదశలోనే ఉంటే వంటింటి చిట్కాలు, జీవనశైలి మార్పులతో సరిచేసుకోవచ్చు. ఆ స్థాయిని దాటిపోయి ఉంటే మాత్రం.. లేజర్ రీ సర్ఫేసింగ్, క్యూ స్విచ్డ్ లేజర్స్ సాయంతో హైపర్ పిగ్మెంటేషన్‌ను సరిచేయవచ్చు.
బొటాక్స్, డెర్మాఫిల్లర్స్‌తో ముడతలను నివారించవచ్చు. డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్.