మహిళలల్లో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే గైనిక్ దగ్గరకు వెళ్ళండి, లేదంటే..?
చాలా మంది మహిళలు ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఎదుర్కొంటుంటారు. సహజంగా 30 ఏళ్లు దాటాక ఈ సమస్య అధికమవుతుంది. ఈ వయసులో మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. వారి జుట్టు రంగు మారుతుంది, చర్మం ముడతలు, స్థితిస్థాపకతను కోల్పోతుంది. తద్వారా జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. అయితే మహిళలు చాలా మంది తమ సమస్యల్ని తక్కువగా లెక్కవేసి వైద్యుల దగ్గరకు వెళ్లేందుకు అశ్రద్ధ చూపిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీ సంబంధమైన సమస్యల విషయంలో వారు అంత తేలికగా వైద్యుల దగ్గరకు వెళ్లేందుకు ముందుకు రారు.
భయం, సిగ్గు లాంటి వాటితో చాలా మంది ఇలాంటి విషయాలను బయటకు చర్చించడానికి కూడా వెనకాడుతుంటారు. అయితే మహిళల్లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నట్లయితే ఎంత తొందరగా వీలైతే అంత గైనకాలజిస్టుని సంప్రదించడం ఉత్తమం. పీరియడ్స్ సమయానికి రాకపోవడం..రుతు క్రమం సరిగ్గా రాకపోతే అది మహిళల ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా మహిళల పీరియడ్స్ వచ్చే సమయం చాలా మందిలో 24 రోజుల నుంచి 38 రోజుల మధ్యలో మారుతూ ఉంటుంది. అంటే 24 రోజులకు పీరియడ్స్ వస్తే మళ్లీ 24 రోజులకు ఆ చక్రం పూర్తై పీరియడ్స్ రావాలి. దీన్నే మేన్‌స్ట్రువల్ సైకిల్ అంటారు.
ప్రతి 24 రోజులకు ఇలా వస్తూ ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు. అలా కాకుండా ఒకసారి 30 రోజులకు, ఒక సారి 38 రోజులకి ఇలా ఇర్రెగ్యులర్‌గా రాకూడదు. అలా వస్తున్నట్లయితే వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి. పొత్తి కడుపులో నొప్పి..కొంత మందికి అప్పుడప్పుడూ కటి, పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి ఇది మరీ ఎక్కువగానూ ఉండి మళ్లీ తగ్గిపోతూ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో, లైంగిక చర్య తర్వాత నొప్పి కలుగుతున్నట్లయితే అది బహుశా వాపు, ఫ్రైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్టుల వల్ల కావచ్చు.
ఇవేమైనా ఉంటే అవి ఆ మహిళ ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి. అందుకనే ఇలాంటి వాటిపై అనుమానం వచ్చినప్పుడు గైనకాలజిస్టును సంప్రదించాలి. వెజైనల్ స్రావాలు..వెజైనాని ఆరోగ్యకరంగా ఉంచడంలో స్రావాలు సహకరిస్తాయి. అయితే కొందరికి ఇవి చిక్కగా, రంగు మారి, దుర్వాసనతో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. అలాగే కొందరు లైంగిక చర్యల్లో పాల్గొనడానికి అసౌకర్యంగా ఉంటుంది.
అలాంటి వాటిని వైద్యులతో మాట్లాడాలంటే చాలా మంది సిగ్గు పడుతుంటారు. అయితే ఇలాంటివి ఉన్నప్పుడు వెనకాడకుండా సమస్యను తమకు వివరించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పై లక్షణాల్లో ఏవి కనిపించినా కూడా మహిళలు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పరిస్థితులు ఆపరేషన్ల వరకు, ప్రాణాపాయ స్థితుల వరకు తీసుకెళతాయి. కాబట్టి అవగాహనతో ఉండటం, ముందస్తు జాగ్రత్త పడటం తప్పనిసరి.