Health

మహిళల్లో ఈ లక్షణాలు కనిపించినట్లయితే అది సర్వైకల్ క్యాన్సర్‌ కావొచ్చు.

గర్భాశయ క్యాన్సర్ తరచుగా మొదటి దశలో నిర్ధారణ అవ్వదు. లక్షణాలు అభివృద్ధి చెందడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అయితే, కొన్ని లక్షణాలు ముందుగా కనిపించినప్పుడు, వాటిని విస్మరించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అయితే మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార క్యాన్స‌ర్ కార‌ణంగా ఎన్నో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. దీని కార‌ణంగా అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించే దేశాల జాబితాలో భార‌త్ ముందు వ‌రుస‌లో ఉంటోంది.

మ‌హిళ‌ల్లో అవ‌గాహ‌న లోపం, సమస్యను ముందుగా గుర్తించ‌లేక‌పోవ‌డం వ‌ల్ల మ‌ర‌ణాలు అధిక‌మ‌వుతున్నాయి. స‌రైన స‌మ‌యంలో గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి మ‌హిళ‌ల్లో దీనిపై అవ‌గాహ‌న పెంచ‌డం చాలా అవ‌స‌రం. గ‌ర్భాశ‌యం దిగువ భాగంలో హ్యూమ‌న్ పాపిల్లోమా వైర‌స్ కార‌ణంగా ఈ వ్యాధి వస్తుంది. యోని లేదా గ‌ర్భాశ‌య దిగువ భాగంపై క్యాన్స‌ర్ క‌ణాలు ఏర్ప‌డి వృద్ధి చెందుతాయి.

ఈ వైర‌స్ సోకిన సమ‌యంలో గుర్తించలేకపోతే క్యాన్స‌ర్‌గా మారి వ్యాధి తీవ్ర‌మవుతుంది. ఈ క్యాన్స‌ర్‌ను ముందు ద‌శ‌లో గుర్తించ‌డానికి పాప్ స్మియ‌ర్ లేదా పాప్ అనే ప‌రీక్ష చేస్తారు. ఈ ప్ర‌క్రియ‌లో గ‌ర్భాశ‌య ముఖ‌ద్వారం నుంచి క‌ణాల‌ను సేక‌రించి ప‌రీక్ష చేస్తారు. ఈ ప‌రీక్ష ద్వారా గుర్తించడం చాలా సులువు. క్యాన్స‌ర్ సోకిన‌ట్లు తెలిస్తే ముందుగానే చికిత్స ప్రారంభించ‌వ‌చ్చు. దాని వ‌ల్ల ప్రాణాపాయం త‌ప్పుతుంది. ఎందుకు సోకుతుంది.. స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం హెచ్‌పీవీ వైర‌స్‌. గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల కార‌ణంగా, ఎక్కువ మంది భాగ‌స్వాముల‌తో లైంగిక సంబంధం, వంశ‌పారం ప‌ర్యంగా త‌దిత‌ర కారణాల వ‌ల్ల ఈ క్యాన్స‌ర్ సోకే ప్ర‌మాదం ఉంది.

ఎక్కువ‌గా వైట్ డిశ్చార్జి అవ్వ‌డం, నెల‌స‌రి స‌మ‌యంలో అధిక ర‌క్త‌స్రావం, దుర్వాస‌న‌, ఎక్కువ సార్లు యూరిన్‌కు వెళ్లాల్సి రావ‌డం, యూరిన్‌కు వెళ్లిన‌ప్పుడు మంట రావ‌డం, లైంగిక చ‌ర్య త‌ర్వాత వెజైనా ద‌గ్గ‌ర నొప్పి మంట ఉండ‌డం త‌దిత‌ర ల‌క్ష‌ణాలు ఉంటే ప‌రీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాన్స‌ర్ కార‌ణంగా రెక్టోవాజిన‌ల్‌, వెసికోవాజిన‌ల్ ఫిస్టులాలు ఏర్ప‌డ‌తాయి. ప‌రిస్థితి ప్రాణాంత‌క ద‌శ‌కు చేరుకునే స‌రికి రోగి ప‌రిస్థితి దారుణంగా ఉంటుంది. క్యాన్స‌ర్ క‌ణాలు ఎముక‌లు, న‌రాలు, కండ‌రాలు, ర‌క్త‌నాళాల‌ను దెబ్బ‌తీస్తాయి. టెస్టులు, చికిత్స..గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార క్యాన్స‌ర్ సోకిన‌ట్లు తెలిస్తే ఏ ద‌శలో ఉందో తెలుసుకోవ‌డానికి ఎక్స‌రేతో పాటు స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

దాని ప్ర‌కారం చికిత్సలు అందిస్తారు. ప‌రిస్థితి తీవ్రంగా ఉంటే కీమోథెర‌పీ, రేడియేష‌న్ ద్వారా చికిత్స చేస్తారు. నివారణ మార్గాలు.. ఈ క్యాన్స‌ర్ ఎక్కువ‌గా 35 నుంచి 45ఏళ్ల వ‌య‌సు మ‌హిళ‌ల‌కు వస్తుంది. అయితే ఆ పైన వ‌య‌సున్న మ‌హిళ‌ల‌కు కూడా వ‌స్తోంది. ఇది రాకుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. హెచ్‌పీవీ వైర‌స్ సోక‌కుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 26ఏళ్ల వ‌య‌సులోపు అమ్మాయిల‌కు టీకా ఇవ్వ‌డం వ‌ల్ల భవిష్య‌త్తులో గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాన్ని తగ్గించ‌వ‌చ్చు. అలాగే మ‌హిళ‌లు త‌ర‌చూ చెక‌ప్‌లు, అనుమానం వ‌స్తే పాప్‌ స్మియ‌ర్ టెస్ట్‌ చేయించుకోవ‌డం వ‌ల్ల వ్యాధి బారిన ప‌డే అవ‌కాశాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker