గ్రామాల్లో కల్లు తాగుతున్నారా..? ఈ విషయాలు మీకోసమే.
ఈత చెట్లనుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆమట్టల నుండి వచ్చే కల్లును కుండలు కట్టి సేకరిస్తారు. మొదటగా లోపలి మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిలిపెడతారు. వారం రోజుల అనంతరం మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కల్లు కారడం మొదలవుతుంది. మట్టలకు కట్టిన కుండను మూడు రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లు పులిసి తరువాత కారిన కల్లుతో కలసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది.
తెలంగాణ పల్లెల్లో విరివిగా లభించే తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది. ఇటీవల ఈ సంస్థ జాతీయ స్థాయిలో విడుదల చేసిన కాంపోజిషన్ పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించింది. తాటికల్లులో ఐరన్, కాల్షియం వంటి పదార్ధాలు సమృద్ధిగా ఉన్నాయని, ఇవి ఎముకల పటిష్టానికి, రక్త వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది. ముఖ్యంగా తాటికల్లులో దేహానికి అవసరమైన పోషకాలు కూడా అత్యధికంగా ఉన్నాయి.
తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే గాకుండా రోగాలు రాకుం డా కాపాడుతుంది. ఇక జాతీయ పోషకాహార సంస్థ తాటికల్లులో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని, ఇది షుగర్ వ్యాధిగ్రస్థులకు మేలుచేస్తుందని తెలిపింది. మినరల్స్, విటమిన్స్ ఆరోగ్య సమతుల్యతకు దోహ దం చేస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఇందులో లభించే ఫ్యాంటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వు పెరుగకుండా నివారిస్తాయి. ఇక ఇందులోని విటమిన్ సీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తాటికల్లుకు సంబంధించిన డాటాను వివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.
తాటి కల్లులో వాటర్ సాల్యూబుల్ విటమిన్స్లో థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ప్యాంటాసిడ్, విటమిన్ సీ వంటి విటమిన్లు ఉండగా, ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్స్ కూడా ఉన్నాయి. కెరోటెనాయిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా శరీరంలో కొవ్వును నియంత్రించే సాచ్యురేచ్డ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీఎస్ఎఫ్ఏ), మోనో ఆన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీఎంయుఎఫ్ఏ), పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్(టీపీయుఎఫ్ఏ)ఉన్నాయి. అయితే పట్టణాల్లో కల్తీ కల్లు వల్ల ప్రజలకు ఈ ఔషధం క్రమంగా దూరం అవుతోంది.
అయితే వాస్తవంలో మార్కెట్లో లభించే అనేక పానీయాలకన్నా కల్లు ఎంతో మేలైంది. ఇందులోని ఔషధ గుణాలు గుర్తించినందువల్లనే తెలంగాణలో పూర్వకాలంనుంచి చిన్న పిల్లలకు కూడా దీన్ని వాడుతూ వచ్చారు. కల్లు మత్తుపదార్థం అనే దుష్ప్రచారాలు జరిగాయి. తాటిచెట్టు వద్ద సకాలంలో దింపిన కల్లు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఏదీ అతిగా తీసుకున్నా క్షేమకరం కాదు. ఇది ఔషధానికైనా, తాటికల్లుకైనా వర్తిస్తుంది. అదేపనిగా మోతాదుకు మించి సేవిస్తే ఏదైనా అనారోగ్యానికే దారితీస్తుంది.