వాణీ జయరామ్ మృతిపై ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది. రిపోర్ట్ లో ఏముందంటే..?
ప్రముఖ సింగర్ వాణి జయరాం మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాణి జయరాం.. నిన్న మృతి చెందారు. ఈమె చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం నుదుటి భాగంపై గాయాలు ఉండటంతో.. ఆమె మృతిపై అనుమానాలు రేకెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది.
ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు రావడంతో.. ఆమె తలపై గాయాలవ్వడానికి గల కారణాలేంటో బహిర్గతమైంది. బెడ్రూంలో ఆమె కిందపడటంతో తలకు బలమైన దెబ్బ తగిలిందని, దాంతో ఆమె మృతి చెందిందని ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను తాము క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో.. వాణీ మృతిపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.
కాగా.. వాణీజయరాం అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టిన ఆమె.. 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, గుజరాతీ, ఒరియా సహా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. మూడు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్న వాణీ.. తొలి పాటకే ఐదు అవార్డులు అందుకోవడం విశేషం.
మొన్నటికిమొన్న కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించింది. అయితే.. ఆ పురస్కారాన్ని అందుకోకుండానే కన్నుమూశారు. వాణీ జయరాం 1968 ఫిబ్రవరి 4వ తేదీన జయరాంను వివాహం చేసుకున్నారు. సరిగ్గా అదే రోజు ఆమె మృతి చెందారు. వాణీ భర్త జయరాం 2018లోనే కన్నుమూశారు. వీరికి పిల్లలు లేకపోవడంతో వాణీ జయరాం ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు.
తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆమె అంతిమయాత్రలో అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం చోటు చేసుకోకుండా ఉండేందుకు, నగర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఆమెకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులు అర్పించారు.