Health

థైరాయిడ్ సమస్య ఉన్నవారికి సంతాన సమస్యలు వస్తాయా..?

థైరాయిడ్‌లో రెండు రకాలు. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ‘హైపర్ థైరాయిడిజం’ సమస్య ఏర్పడుతుంది. అలాగే ఈ హార్మోన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు ‘హైపోథైరాయిడిజం’ బారిన పడతాడు. థైరాయిడ్ ప్రారంభ లక్షణాలపై శ్రద్ధ వహిస్తే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కొన్ని చికిత్సల ద్వారా దీనిని నియంత్రించవచ్చంటున్నారు నిపుణులు. అందుకే దాని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక జీవక్రియలు కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాయిడ్ హార్మోన్ సరైన మొత్తంలో శరీరంలో విడుదల కాకపోతే పలు రుగ్మతలకు దారి తీసే అవకాశం ఉంది.

హైపర్ హైపో ఈ రెండు రకాల థైరాయిడ్ రుగ్మతల వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ హార్మోన్ సంతాన సమస్యలకు కారణం అవుతుంది. అండాశయంలో జరిగే పరిణామాలకు థైరాయిడ్ హార్మోన్ కారణమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం కారణంగా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు. తద్వారా శరీరంలో కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాదు. ఈ కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు పెరగడం ద్వారా సంతానలేమి సమస్యలు మహిళల్లో తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక పురుషుల్లో హైపోథైరాయిడిజం కారణంగా సంతానలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం కారణంగా శుక్ర కణాల్లో చలనం సరిగా ఉండదని వైద్యులు చెబుతున్నారు. అలాగే స్పర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ విషయంలో కూడా థైరాయిడ్ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. హైపోథైరాయిడిజం కారణంగా లైంగికంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తద్వారా అంగస్తంభనలు సరిగ్గా లేకపోవడం, శుక్రకణాల్లో కదలిక లేకపోవడం కారణంగా అండాశయంలో అండాన్ని చేరుకోవడం, శుక్రకణాలు విఫలమయ్యే అవకాశం ఉందని, తద్వారా సంతాన లేమి సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక హైపోథైరాయిడిజం మహిళల్లో కూడా రుతుక్రమం దెబ్బతీసేందుకు దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రుతుక్రమం దెబ్బ తినడం వల్ల అండం సరైన సమయంలో విడుదల కాదని, ఫలితంగా సంతాన ఉత్పత్తికి అవసరమైన ప్రక్రియ నెమ్మదిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. ఇక హైపర్, హైపో ఈ రెండు రకాల థైరాయిడ్ సమస్యలు కారణంగా సంతానలేమి సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం విషయంలో బరువు పెద్ద ఎత్తున కోల్పోవడం, గుండె సమస్యలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

మహిళల్లో హైపర్ థైరాయిడిజం కారణంగా పీరియడ్స్ సరైన సమయంలో రాకపోవడం ఒక సమస్యగా కనిపిస్తుంది. ఇక పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. థైరాయిడ్ సమస్యలను గుర్తించేందుకు రెండు రకాల రక్త పరీక్షలు ఉన్నాయి. అందులో మొదటిది TSH పరీక్ష, TPO పరీక్ష. సంతానం కోసం ప్లాన్ చేస్తున్న దంపతులు.. వైద్యుల సూచన మేరకు థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా వారికి ఉన్న సమస్యలను గుర్తించవచ్చు. థైరాయిడ్ సమస్యకు మందుల రూపంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయం లభించింది. థైరాయిడ్ మందులను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా హైపర్ హైపోథైరాయిడిజం జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker