కళ్లు తెరచి తుమ్మితే గుండె ఆగిపోతుందా..? అసలు ఏంటో తెలిస్తే..?
తుమ్ము అనేది ఒక సాధారణ ప్రక్రియ. కొన్నిసార్లు తుమ్ములు సీజన్ మారుతున్నందున లేదా కొన్నిసార్లు అలెర్జీ కారణంగా సంభవిస్తాయి. అయితే ఇది చెడు శకునంగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైనా శుభ కార్యం చేసే ముందు తుమ్ములు వచ్చినట్లయితే అది శుభప్రదంగా పరిగణించరు. అంతే కాకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఇంటి సభ్యుడు తుమ్మినా.. కొంత సేపు బయటకు వెళ్లకుండా మా బంధువులు ఆపేస్తారు. అయితే తుమ్మితే కళ్లెందుకు మూసుకోవాలి..ఈ విషయం గురించి వివరించేందుకు కచ్చితమైన క్లినికల్ డేటా అందుబాటులో లేదనే చెప్పాలి.
తుమ్ము వల్ల మన శరీరం నుంచి బయటకు చిందే తుంపరలు కళ్లలో పడకుండా అనే లాజిక్ ఒకటి ప్రాచూర్యంలో ఉంది. అసలు ఇలా అసంకల్పితంగా ఎందుకు కళ్లు మూసుకుంటాము అనే విషయాలు తెలుసుకునేందుకు మరింత పరిశోధన అవసరం అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. తుమ్ము ముక్కులోని అవసరం లేని లేదా హాని కారక కణాలను వదిలించుకునే చర్యగా చెప్పుకోవచ్చు. అలాగే దగ్గు గొంతు, ఊపిరితిత్తుల నుంచి హాని కారకాలను బయటకు పంపే చర్యగా చెప్పాలి.
తుమ్ము దాదాపుగా లక్ష సూక్ష్మ క్రిములను బయటకు విసర్జిస్తుందని అంచనా. తుమ్ముకు కొన్ని కారణాలు..దుమ్ము, పుప్పొడి, చుండ్రు, అలర్జీల వల్ల, జలుబు, ఫ్లూ వల్ల, చల్లని గాలి వల్ల, పొడి గాలి వల్ల, కాలుష్యం వల్ల, మిరియాలు, కొత్తిమీర, జీలకర్ర వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఇలా రకరకాల కారణాలతో తుమ్ము రావచ్చు. కనుబొమ్మలను లాగినపుడు లేదా పీకినపుడు తుమ్ము రావచ్చు.
కనుబొమ్మలను పీకినపుడు ముఖంలో ఉండే నాడులు ఇరిటేట్ అవుతాయి. అందువల్ల నాసికా నాడిలో ప్రేరణ కలిగి తుమ్ము రావచ్చు. తుమ్మినపుడు గుండె ఆగుతుందా.. తుమ్మినపుడు సెకండ్ కాలం పాటు గుండె ఆగుతుందని ఒక వాదన ప్రాచూర్యంలో ఉంది. కానీ అది అపోహ మాత్రమేనట. తుమ్మినపుడు గుండె కొట్టుకునే తీరు మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది అంతే అని నిపుణులు అంటున్నారు. తుమ్ము ఆపొద్దు..తుమ్ము ఆపడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
తుమ్ము ఆపుకోవడం ఫిజికల్ ఇంజూరీకి కారణం కావచ్చట. తుమ్ము ఆపుకోవడం వల్ల మధ్య చెవి, లోపలి చెవి మీద ఒత్తిడి పెరిగి వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందట. డయాఫ్రంకు నష్టం జరగవచ్చు. మెదడు రక్తనాళాలు దెబ్బతినవచ్చు లేదా బలహీన పడవచ్చు. కళ్లలో రక్తనాళాలు చిట్లిపొయ్యే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, తుమ్ముతో జాగ్రత్త.