ప్రజలకు గుడ్ న్యూస్, ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ఎవ్వరూ కట్టొద్దు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్.. తాము అధికారంలోకి వస్తే, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక.. ఖజానాలో మనీ లేదని పదే పదే చెబుతోంది. అందుకే కొంతకాలం వేచి చూసిన ప్రజలు.. ఇంకా అమలు చెయ్యకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు మరింత సీరియస్ అవ్వకుండా ఉండేలా.. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టింది.
అయితే ఈ నేపథ్యంలో ఉచిత కరెంటు అమలు విషయమై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టొద్దు అని చెప్పారు కేటీఆర్. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దని ప్రజలకు కేటీఆర్ సూచించారు.
స్వయంగా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలని అన్నారు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలని, సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పారని గుర్తు చేసిన కేటీఆర్.. మీ కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి పంపించండి అని అన్నారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలి. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు 2500 వెంటనే ఇవ్వాలని కేటీఆర్ అన్నారు.
కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ఇచ్చిన అన్ని హామీలు 100 రోజుల్లోగా పూర్తి చేస్తామని బల్లగుద్ది చెబుతోంది.