ఈ చిట్కాలతో పసుపు పచ్చగా ఉన్న మీ దంతాలు తెల్లగా మారుతాయి.
తెల్లటి దంతాలు కలిగి ఉండటం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అవి మన నోరు ఆరోగ్యంగా ఉన్నదని చెప్పడానికి ఉపయోగపడవు. నోటి సాధారణ ఆరోగ్యం చిగుళ్ళ పనితీరు ద్వారా ప్రభావితమవుతుంది. అయితే మనలో చాలామంది దంతాల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఫలితంగా దంతాలు పచ్చగా మారడంతో పాటు కాంతివిహీనంగా కనిపిస్తాయి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా తెల్లని దంతాలను పొందవచ్చు.
మనం తీసుకునే కొన్ని ఆహారాలు దంతాలకు రక్షణ కల్పించే ఎనామిల్ పొరను పాడు చేయడం వల్ల దంతాలు పసుపు రంగులో, కాంతివిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. వైటెనింగ్, రెగ్యులర్ క్లీనింగ్ ద్వారా ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ పుల్లింగ్ పద్ధతి పళ్లు తెల్లగా చేయడంలో సహాయపడుతుంది.
ఈ విధానంలో నోటిలో నూనెను వేసుకుని పుక్కలించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నోట్లో ఉండే సూక్ష్మజీవులు తొలగిపోతాయి. ఈ పద్ధతి ద్వారా నోటిపూత సమస్యతో బాధ పడే వాళ్లకు సైతం మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను 15 నుంచి 20 నిమిషాల పాటు నోటిలో వేసుకుని పుక్కలించి ఈ సమస్యను అధిగమించవచ్చు. వేప పుల్లతో పళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా పళ్లు తెల్లగా మారతాయి. వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ పళ్లు తెల్లగా ఉండటంలో సహాయపడతాయి.
నోటిలోని ఓరల్ కావిటీని శుభ్రం చేయడానికి టంగ్ స్క్రాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల నాలుకపై ఉండే బ్యాక్టీరియాను సులువుగా తొలగించవచ్చు. తులసి ఆకులను నీడలో ఎండబెట్టి నూరి మెత్తగా పొడి చేసి ఆ పొడితో పళ్లు రుద్దుకుంటే పళ్లు తెల్లగా మారతాయి. రెగ్యులర్ పేస్ట్ కు తులసి జత చేసి వాడినా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ చిట్కాలు పాటించి సులువుగా తెల్లగా మిళమిళ మెరిసే పళ్లను పొందవచ్చు.