ఈ టీ తాగితే పదిరోజుల్లోనే మీ అందం అమాంతం పెరుగుతుంది.
బ్లూ టీని అపరాజిత పుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ రంగుని చాలా మంది తాగేందుకు ఇష్టపడరు. కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ఈ టీతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లూ టీలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వయసు ఎక్కువగా ఉన్నా కనిపించదు. దీన్ని డైలీ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్’ అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. తెలుగిళ్లల్లో వీటిని శంఖం పూలు అంటారు.
ఎక్కువగా ఇళ్ల ముందు కనిపించే తీగమొక్కలు ఇవి. శివుడికి ఆ పూలు ప్రీతిపాత్రమైనవి. వాటితో తయారుచేసే టీ ‘బ్లూ టీ’. హెర్బల్ టీలలో ఇదీ ఒకటి. ఇప్పుడు చాలా మంది సెలెబ్రిటీల బ్యూటీ మంత్ర ఈ బ్లూ టీనే. బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ బ్లూ టీ తాగుతున్నట్టు చెబుతూ ఆ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ బ్లూటీ తాగడం వల్ల అందం కూడా ఇనుమడిస్తుందంటున్నారు ఆహారనిపుణులు. కెఫీన్ నిండుగా ఉండే టీ, కాఫీల కన్నా బ్లూ టీ లాంటి హెర్బల్ టీలు తాగడం వంద రెట్లు ఉత్తమం.
శంఖం పూలలో యాంటీ గ్లైకేషన్ గుణాలు ఎక్కువ. ఇవి వయసు పెరుగుతుండడం వల్ల వచ్చే చర్మం సమస్యలను రాకుండా నిరోధిస్తాయి. కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం సౌందర్యాన్ని కాపాడతాయి. ముఖంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. 2018లో చేసిన ఓ స్టడీ ప్రకారం శంఖం పూలతో చేసిన ఫేస్ మాస్కులు ముఖంపై దురదలు, మొటిమలు, చర్మం పొడిగా మారడం వంటి సమస్యలను దూరంగా ఉంచుతాయి.
ఈ టీ వల్ల చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహకరిస్తుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మంపై పొరని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బ్లూ టీ తాగడం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.