రోడ్డు మధ్యలో ఉన్న ఈ రాయిని పూజిస్తే మోకాళ్లు, కీళ్ల నొప్పులు వెంటనే తగ్గిపోతాయి.
మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తే ఆస్పత్రికి వెళ్తాం. అక్కడ వైద్యులు ఇచ్చిన మందులను వాడుతాం. అలాగే కొందరు ఆయుర్వేద మందులను ఉపయోగిస్తారు. కానీ కర్ణాటక చామరాజనగర్ ప్రజలు మాత్రం జాతీయ రహదారిపై ఉన్న రాయి దగ్గరకు వెళుతున్నారు. ఆ రాయికి మొక్కితే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయంటున్నారు. అయితే యలందూర్ నుంచి మాంపల్లి వైపు వెళ్తున్న నేషనల్ హైవేపై ఓ బండ చాలాకాలంగా ఉంది.
ఎవరు ప్రచారం చేశారో.. ఎందుకు చేశారో తెలియదు కానీ.. ఆ బండకు మొక్కితే.. బాడీ పెయిన్స్, మోకాళ్లు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి నుంచి విముక్తి కలుగుతుందని ఊరూ వాడా మారుమోగిపోతుంది. దీంతో ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆ బండకు పూజలు చేసేందుకు పోటెత్తుతున్నారు. ఈ రూట్‌లో వచ్చే చాలామంది ఆ బండ వద్ద ఆగి మొక్కి వెళ్తున్నారు.
నారికల్లు మారమ్మ అక్కడ కొలువు తీరిందని.. ఆమె తన మహిమతో ప్రజలు సమస్యలు పారద్రోలుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఆ హైవేపై వాహనాల రద్దీ ఉన్నప్పటికీ జనాలు వెనక్కి తగ్గడం లేదు. కాగా మెడిసిన్ వాడకుండా ఇలాంటి పూజలు చేస్తే.. ఎటువంటి ప్రయోజనం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. మూఢ నమ్మకం కారణంగా సైకలాజికల్‌గా కాస్త స్వాంతన కలిగినట్లు అనిపించినా.. కాలం గడిచేకొద్దీ సమస్యలు తీవ్రం అవుతాయని.. అందుకే వెంటనే సంబంధిత డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలని కోరుతున్నారు.