మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జలుబు అనుకోవద్దు, ఈ కొత్త వైరస్ కూడా..?
సీజన్లు మారినప్పుడు.. అలర్జీలు ఉన్నవారికి.. శీతలపానీయాలు పడని వారికి.. ఇంకా అనేక రకాల కారణాల వల్ల అనేక మంది జలుబు చేస్తుంటుంది. జలుబు చేసిందంటే చాలు కళ్లు ఎరుపెక్కుతాయి. తుమ్ములు, దగ్గు వస్తుంది. గొంతు వాపు కనిపిస్తుంది. ముక్కు కారుతుంది. అయితే HMP అనేది రెస్పిరేటరీ వైరస్. న్యూమోవిరిడే కుటుంబానికి చెందినది. 2001 లో నెదర్లాండ్స్ లో 28 మంది పిల్లల్లో కనుగొన్నారు. వ్యాధి సోకిన పిల్లల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరిపారు.
శ్వాస కోశ సిన్సిటియల్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ఇబ్బందులతో ఈ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధి నుంచి న్యుమోనియా వరకు ఇది పరిణితి చెందవచ్చు. ఈ వైరస్ కనీసం 50 సంవత్సరాలుగా మానవులలో వ్యాపిస్తోందని పరిశోధకులు కనుగొన్నారు. HMP కేసులు 30 శాతం పెరిగాయి.. ఒక నివేదిక ప్రకారం ఈ మెటాప్ న్యూమోవైరస్ కేసులు మార్చిలో యూఎస్ అంతటా వ్యాపించాయి. యూఏస్ సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఈ వైరస్ ను అడ్డుకునేందుకు 19.6 శాతం యాంటీజెన్ పరీక్షలు 10.9 శాతం పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
మహమ్మారి కంటే ముందుగానే ఈ వ్యాధి కేసులు 36 శాతం పెరిగాయి. ఈ వైరస్ యునైటెడ్ స్టేట్స్ లో ఒక ఫ్లూ మాదిరిగా మారిపోయింది. శీతాకాలంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు ఏంటి.. యూఎస్ సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు ఎక్కువగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లల్లో కనిపిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన చిన్నారుల్లో న్యుమోనియా లక్షణాలు బయట పడుతున్నాయని అమెరికన్ లంగ్ అసోసియేషన్ తెలిపింది.
ఈ వైరస్ సోకిన వారికి ఎక్కువగా జలుబు చేస్తుంది. ఇమ్యూనిటీ బాగా ఉన్నవాళ్ళు త్వరగా తమంతట తాముగా కోలుకోగలుగుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. ఇది అంటు వ్యాధి. రోగి తుమ్మినా దగ్గినా నోటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తోంది. బాధిత వ్యక్తిని తాకినా, వారి వస్తువులు ముట్టుకున్నా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వైరస్ కి నిర్దిష్టమైన చికిత్స ఏమి లేదు. వ్యాక్సిన్ తయారీలో పరిశోధకులు నిమగ్నమయ్యారు. దీని నిరోధించడానికి టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు.
అందుకే తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. కనీసం 2 సెకన్ల పాటు చేతులని తరచుగా సబ్బుతో నీటితో కడగాలి. బయటకి వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా ముక్కు, నోరు, కళ్ళు తాకకూడదు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోకూడదు. వ్యాధి సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కుకి ఏదైనా అడ్డం పెట్టుకోవాలి. రోగికి సంబంధించి వస్తువు, పాత్రలు, దుస్తులు ఇతరులతో పంచుకోవడం మానుకోవాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరు బయట తిరగకపోవడమే మంచిది.