అతిగా చెమట పడుతోందా..? ఆ వ్యాధికి సంకేతమేనట..!
శరీరం ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభించినప్పుడు అది మధుమేహానికి కూడా కారణమవుతుందని వైద్యులు సెలవిస్తున్నారు. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపు తప్పిందని, శరీరం నుంచి వివిధ హార్మోన్లు విడుదలవుతాయని వారు చెప్తున్నారు. మధుమేహం మన శరీరంలోని స్వేద గ్రంథులను ప్రభావితం చేసి అధిక చెమటకు కారణమవుతుంది. ఒక వ్యక్తి వ్యాయామం చేస్తున్నప్పుడు ఎండలో నడుస్తున్నప్పుడు చెమటలు పడతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, ఈ చెమట ఉత్పత్తి అవుతుంది. తరచుగా మెనోపాజ్ కారణంగా మహిళలు విపరీతంగా చెమటలు పడుతుంటారు.
అయితే విపరీతంగా చెమట పట్టినట్లు అనిపించే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి పరిస్థితిలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే అది అనేక వ్యాధులకు కారణం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి రక్తంలో తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి కానప్పుడు డయాబెటిక్ హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది.
శరీరం, మెదడుకు శక్తి ప్రధాన వనరు గ్లూకోజ్. శరీరం తగినంత గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేయకపోతే శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి విపరీతంగా చెమట పట్టడం వల్ల బెడ్ షీట్లు, బట్టలు కూడా తడిసిపోతాయి. అలాంటి వ్యక్తులు అలసట, చిరాకు లేదా భ్రమ కలిగించే స్థితుల సమస్యను ఎదుర్కొంటారు. అయితే అధిక చెమటను మధుమేహం లక్షణంగా పరిగణించాల్సిన అవసరం లేనప్పటికీ అనేక ఇతర కారణాలు దీనికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది.
ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం ఎక్కువగా చెమట పట్టడానికి ప్రధాన కారణాలు. మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా కూడా అధికంగా చెమటలు పడుతుంటాయి. అదేవిధంగా హైపర్ థైరాయిడిజం వ్యాధికి గురైన సందర్భాల్లో , లుకేమియాతో బాధపడుతున్నప్పుడు, గుండె జబ్బులు ఉన్న సమయాల్లో విపరీతంగా చెమట పడుతుంది.