ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా..?
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తిరుగులేని శక్తిగా అవతరించి జనాలచేత దేవుడిగా కీర్తించబడ్డ వ్యక్తి ఎన్టీఆర్. సిద్థాంతాలకు మారు పేరుగా నిలిచిన ఎన్టీఆర్, షూటింగ్ టైమ్ తో పాటు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండేవారట. రామారావు ఒకేసారి నాలుగు కేజీలు మాంసం ఆరగించిన సందర్భాలు కూడా ఉన్నాయట.
గారెలు డజను, పెసరట్లు అరడజను, మిరపకాయ బజ్జీలు లెక్కలేనన్ని ఒకేసారి తినే అలవాటు కూడా రామారావుకి ఉండేదట. అయితే ఎన్ని ఆహారపదార్థాలు తిన్నా.. ఆయనకు వెంటనే జీర్ణం అయ్యేదట. అంత గొప్ప జీర్ణశక్తి రామారావు కి ఉండటం నిజంగా ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. 300-400 షుగర్ రీడింగ్స్ చూపిస్తున్న సమయంలో కూడా ఆయన కేజీ కలకంద్ తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయట. ఎన్టీరామారావు ఆకలికి అస్సలు తట్టుకోలేకపోయేవారట. జానపద బ్రహ్మ విఠలాచార్య ప్రొడక్షన్ స్టైలు చాలా డిఫరెంట్ గా ఉండేది.
విఠలాచార్య తన సినిమాలో నటించే నటీనటులు, ఇంకా టెక్నీషియన్లకు తిన్నంత తినండి కానీ లెక్క రాయండి అనే నిబంధన పెట్టేవారు. ఐతే ఎన్టీరామారావు 4 ఉప్మా పెసరట్లు, అరడజను పూరీలు, నెయ్యి-పాలు-పంచదార కలిపిన 2-3 కప్పుల పొంగలి ఎంచక్కా ఆరగించే వారట. అలాగే గంటకీ లేదా అరగంటకి 1 కప్పు టీ తాగే వారట. ఆ తర్వాత ప్రతి రోజు లెక్క రాసేవారట. అయితే 4 నెలల సినిమా షూటింగ్ కి ఎన్టీఆర్ 20,000 పారితోషికం పుచ్చుకునేవారట. విఠలాచార్య ఏ నెలకానెల 5 వేల రూపాయలు ఇచ్చేవారట.
విఠలాచార్య ఒక నెల షూటింగ్ పూర్తి కాగానే రెమ్యూనరేషన్ ఇవ్వడం ప్రారంభించారట. అయితే రామారావు కి రూ. 5000 ఇవ్వాల్సింది పోయి కేవలం రూ.2000 రూపాయలు ఇచ్చారట. నాకు రావాల్సిన 5000 కదా రెండు వేలే ఇచ్చారు ఏంటండీ.. అని రామారావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగారట. దీనితో “మీరు మా ప్రొడక్షన్ కంపెనీ పెట్టిన టిఫిన్స్ బాగా ఆరగించారు కదా. లెక్క కూడా రాశారు కదా.. మీరు తిన్న వాటికి 3 వేల రూపాయలు ఖర్చు అయింది. అందుకే 5 వేల నుంచి 3వేలు తగ్గించి 2 వేల రూపాయలు ఇస్తున్నానండీ’ అని నిర్మొహమాటంగా చెప్పేశారట.
తన కంపెనీ కేవలం రెండు ఇడ్లీ, ఒక వడ, ఒక కప్పు టీ, సాయంత్రం స్నాక్స్ మాత్రమే భరించగలదని.. ఆ విషయం అందరికీ తెలిసిందేనని విఠలాచార్య చెప్పడంతో ఇక రామారావు చేసేదేమీలేక రెండువేలతో సరిపెట్టుకున్నారట. ఇక అప్పటి నుంచి రామారావు ముందస్తుగానే తన ఆహారం ఖర్చు కూడా ప్రొడక్షన్ కంపెనీయే భరించాలని చెప్పేవారట. నిమ్స్ ఆస్పత్రికి ఎదురుగా మీసాల రాజు అనే వ్యక్తి హోటల్ నడిపేవారు. ఆ హోటల్ నుంచి భారీ ఫుడ్ క్యారేజ్ తెప్పించుకునే వారట. ఆ బాక్స్ లలో కోడి, చేప ఇంకా రక రకాల ఫుడ్ ఐటమ్స్ ఉండేవట. రామారావు ఉదయాన్నే మూడు గంటల సమయంలో ఒక కోడి మొత్తం తినేసే వారిని కూడా అంటుంటారు.