పొగ తాగేవారికి ఎన్ని రకాల జబ్బులు వస్తాయో తెలుసా..?
గ్రామీణ ప్రాంతాలలోని వారు పొగను పీల్చే దశ నుండి బీడీలు, చుట్టలతో పాటు అత్యంత ఫ్యాషన్‌గా సిగరెట్స్ వచ్చి చేరాయి. సినీ తారల వ్యాపార ప్రకటనలతో, సినిమాలలో నటులు పొగ తాగే సన్నివేశాలను అధికంగా చూపడం వలన వారి హావభావాలతో ప్రజలందరూ అనుకరించడం ఆరంభమైంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం.
కానీ ఒక్కసారి ధూమపానానికి అలవాటు పడితే ఆ అలవాటును మానేయడం అంత తేలిక కాదు. కొందరు పొగ తాగడం మానేయడానికి ప్రయత్నించినా మానేయలేకపోతున్నామని చెబుతున్నారు. మొదట ఒక సిగరెట్ తో సరదాగా మొదలుపెట్టిన వారే ఆ తరువాత ధూమపానానికి అడిక్ట్ అవుతున్నారు. పొగ తాగటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. అయితే వైద్య నిపుణులు పొగ తాగే వారికి సంబంధించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
పొగ తాగే అలవాటు ఎంత పెరిగితే అంత ఆయుష్షు తగ్గుతుందని చెబుతున్నారు. పొగ తాగేవారు శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలతో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని ఫలితంగా మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ పరిశోధకులు అనేక పరిశోధనలు చేసి ఈ విషయాలు వెల్లడించారు. 152,483 మంది రోగులపై పరిశోధనలు జరిపి పొగ తాగే అలవాటు ఎక్కువగా ఉన్నవారు 28 రోగాల బారిన పడే అవకాశం ఉందని తేల్చారు.
పొగ తాగని వారిని పొగ తాగే వారిని పోల్చి చూసినపుడు పొగ తాగే వారు 30 శాతం అధికంగా వ్యాధుల బారిన పడుతున్నట్టు తేలిందని చెప్పారు. పొగ తాగే వారు వారి ఆయుష్షులో పది సంవత్సరాల ముందే మరణించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. పొగ తాగే వారు గుండె సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, కంటి, రక్త సంబంధిత వ్యాధులు, న్యూమోనియా బారిన పడే అవకాశం ఉందని అధ్యనంలో తేలింది.