మీరు నిద్రలో మాట్లాడుతున్నారా..? దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?
నిద్రలోని వివిధ దశల్లో తలెత్తే ఒక రకమైన రుగ్మత. ఇది కొందరిలో వారసత్వంగా సంక్రమించవచ్చు. లేదంటే ఏదైనా మానసిక రుగ్మతకు సంబంధించిన సమస్య కావచ్చు. మామూలుగా అయితే ఇది మానసిక ఒత్తిళ్ల ఫలితంగా వస్తుంది. అయితే అధ్యయనాల ప్రకారం 66% మంది వ్యక్తులు స్లీప్ టాకింగ్ డిజార్డర్ బారిన పడినట్టు అంచనా. అలానే వీరు రోజూ నిద్రలో మాట్లాడరు. కొన్ని రోజులకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి తాము నిద్రలో మాట్లాడుతున్నట్టు తెలిసే అవకాశం ఉంది.
కొంతమందికి ఏదీ తెలిసే అవకాశం లేదు, కుటుంబ సభ్యులు చెబితే ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఇలా నిద్రలో మాట్లాడటం వెనక స్పష్టమైన కారణాన్ని కనిపెట్టలేకపోయారు. దీనికి జన్యుపరమైన కారణాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. స్లీప్ టాకింగ్ అనేది పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా పిల్లల్లో పీడకలలు వచ్చేటప్పుడు వారు ఇలా నిద్రలో మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. అధ్యయనకర్తలు అలాగే యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతున్న వారు కూడా నిద్రలో మాట్లాడే అవకాశం ఉంది. ఇక మద్యం మత్తులో తూగుతున్న వారు కూడా ఇలా మాట్లాడతారు. అధిక జ్వరం బారిన పడినవారు కూడా స్లీప్ టాకింగ్ చేయొచ్చు.
నిద్రలో మాట్లాడటానికి ‘సోమ్నిలోక్వి’ అని అంటారు. ఇది ఆ వ్యక్తికి పెద్దగా హాని చేయదు. చాలా అరుదైన పరిస్థితుల్లోనే హాని కలిగించే అవకాశం ఉంది. అయితే వారితో పాటు, నిద్రించే వారికి మాత్రం నిద్ర పట్టక ఇబ్బంది పడవచ్చు. నిద్రలో మాట్లాడే ఫ్రీక్వెన్సీ ని తగ్గించడానికి వైద్యులు కొన్ని రకాల చిట్కాలు చెబుతున్నారు. స్లీప్ టాకింగ్ తగ్గించడానికి ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను అలవాటు చేసుకోవాలి. సరైన సమయానికి నిద్రపోవడం, రోజు ఒకే సమయానికి నిద్ర లేవడం వంటివి చేయాలి.
అర్ధరాత్రి వరకు సినిమాలు, టీవీలు చూస్తూ గడపకూడదు. పరిశుభ్రమైన వాతావరణంలోనే నిద్రించాలి. పక్క దుప్పట్లు ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి. గది ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. చాలామంది ప్రజలు ఒత్తిడికి గురైనప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు నిద్రలో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వారి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానం వంటివి చేయాలి.