సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి.
సైలెంట్ హార్ట్ ఎటాక్. ఇది వచ్చినప్పుడు.. తేలికపాటి, కొన్ని సార్లు ఎటువంటి సంకేతాలు లేకుండా సడెన్‌గా వస్తుంది. కొన్ని సార్లు వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నిర్లక్ష్యం చేస్తారు. మీ గుండెకు తగినంత ఆక్సిజన్ అందకపోతే సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే ఎలాంటి లక్షణాలు లేకుండా లేదా తేలికపాటి లక్షణాలతో లేదా గుండెపోటుతో సంబంధం లేని లక్షణాలతో హార్ట్ ఎటాక్ రావడాన్ని సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. గుండెపోటు లేదా మయోకార్డియల్ ఇన్ఫార్‌క్షన్ అనేది గుండెకు ఆక్సిజన్ అందనప్పుడు గుండె కండరాలు గాయపడటం వల్ల వస్తుంది.
కొరోనరీ ధమనులలో ఒకదాని ద్వారా రక్తం గుండెకు ప్రవహించకుండా ఆగిపోవడం, నాళాల్లో రక్తం గడ్డకట్టడం గుండెపోటుకు కారణమవుతుంది. ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు లేదా మేల్కొని ఉన్నప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. సాధారణంగా శారీరకంగా లేదా మానసికంగా ఒత్తిడికి గురవ్వడం, మితిమీరిన శారీరక శ్రమ కారణంగా అప్పటికే ఉన్న సమస్య ఒక్కసారిగా బయట పడవచ్చు. సైలెంట్ హార్ట్ ఎటాక్స్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అన్ని రకాల గుండెపోటులలో దాదాపు 50% నుంచి 80% వరకు ఇలా సైలెంట్ వర్గానికి చెందినవని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.
సైలెంట్ హార్ట్ ఎటాక్ ఉన్న వ్యక్తుల్లో సాధారణంగా గుండెపోటుతో సంబంధం లేని లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు తేలికపాటి లక్షణాలు ఉంటాయి లేదా ఎటువంటి లక్షణాలు బయటపడవు. దీంతో తమకు గుండెపోటు వచ్చిందని బాధితులు గుర్తించకపోవచ్చు. కొన్నిసార్లు గుండెపోటు సమయంలో వచ్చే నొప్పి ఆకస్మికంగా, తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే, వీలైనంత త్వరగా బాధితులకు వైద్య సహాయం అందించవచ్చు. సైలెంట్ హార్ట్ ఎటాక్ వస్తే, లక్షణాలు పెద్దగా కనిపించవు. కానీ అన్ని రకాల గుండెపోటులు బాధితుల ఛాతీ మధ్యలో తేలికపాటి నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి, కండరాలు పిండేసినట్లు అనిపించడం, ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు.
ఈ లక్షణాలు నెమ్మదిగా ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు పూర్తిగా తగ్గిపోయి తిరిగి రావచ్చు. సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే సూచనలు ఉంటే, ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ తీవ్రతతో బయటపడవచ్చు. ఈ లక్షణాలు గుండెల్లో మంట, అజీర్తి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలుగానే ఉండవచ్చు. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి టెస్టులు చేయించుకొని, ట్రీట్‌మెంట్ తీసుకోవడం మంచిది. కడుపు నొప్పి, అజీర్ణం, గుండెల్లో మంట, వికారం వంటి జీర్ణ సంబంధ సమస్యలు గుండెపోటు ప్రారంభ లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో పొత్తి కడుపు పైభాగం మధ్యలో కత్తిపోటు కంటే భారీగా నొప్పిగా అనిపిస్తుంది.
కొన్ని నిమిషాల పాటు ఇలా తీవ్రమైన నొప్పి ఉంటే, అది సైలెంట్ హార్ట్ ఎటాక్‌గా అనుమానించాలి. దీంతోపాటు శ్వాస సమస్యలు, గుండె కొట్టుకునే వేగం మారడం వంటివి కూడా ఉంటే, అది గుండెపోటును సూచిస్తుంది. సాంప్రదాయ గుండెపోటు లక్షణాలు సైలెంట్ హార్ట్ ఎటాక్ కంటే భిన్నంగా, తీవ్రంగా ఉంటాయి. ఛాతీ నొప్పి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండటం, శ్వాస ఆడకపోవడం, శరీరంలోని పై భాగాలు లేదా అవయవాల్లో నొప్పి, అసౌకర్యం, తల తిరగడం, చల్లని చెమటలు, వికారం, వాంతులు, కొన్ని రోజుల పాటు అలసటగా ఉండటం.. ఇవన్నీ సాధారణ గుండెపోటు లక్షణాలు. వ్యక్తులను బట్టి కొందరిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపించవచ్చు.