సడన్‌గా ఛాతీలో నొప్పి, వాంతులు, నా భర్తకు జ్వరమనేదే తెలీదు : నటి సనా
సాధారణంగా గుండెకి ఎడమభాగంలో నొప్పి వస్తే గుండె నొప్పి వచ్చిందని కంగారు పడుతుంటారు. కుడివైపున నొప్పి వస్తే.. పెద్దగా పట్టించుకోరు. ఏదో గ్యాస్ ప్రాబ్లమ్ అయ్యుంటుందిలే లైట్ తీసుకుంటారు. అయితే కుడి పక్కన నొప్పి వచ్చినా కూడా అది గుండెనొప్పి వావొచ్చుని.. అది చాలా డేంజర్ అని.. తన భర్తకి ఎదురైన రియల్ ఇన్సిడెంట్‌ని షేర్ చేసుకున్నది నటి సనా.
అయితే తాజాగా తన భర్తకు ఏమైంది? అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అన్న వివరాలు తెలుపుతూ తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. సనా మాట్లాడుతూ.. ‘ఒక రోజు నేను షూటింగ్ నుంచి రాత్రి 8.30 గంటలకు వచ్చేసరికి నా భర్త నొప్పితో విలవిల్లాడుతున్నాడు. సాధారణంగా హార్ట్ ఎటాక్ అంటే ఎడమవైపు వస్తుందనే అనుకుంటాం. ఆయనకు కుడివైపు నొప్పి అనడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకున్నాం.
ఈనో సహా కొన్ని జ్యూసులు తాగారు. అయినా నొప్పి తగ్గలేదు. తనకు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఏ సమస్యలూ లేవు. ఆస్పత్రికి వెళ్దాం, స్నానం చేసి రమ్మన్నాను. స్నానం చేసి వచ్చాక తాను వాంతులు చేసుకున్నట్లు తెలిపాడు. తనకు జ్వరం కూడా తెలీదు. అలాంటిది ఎందుకిలా అయ్యిందని.. ఆస్పత్రికి వెళ్దామన్నాను. హాస్పిటల్‌కు వెళ్లాక ఆయన పడుతున్న ఇబ్బందులను గమనించి ఈసీజీ సహా ఇంకేదో పరీక్ష చేశారు. దాని ఆధారంగా ఆయనకు ఉదయమే గుండెపోటు వచ్చిందని వెల్లడించారు.
గుండెకు కుడివైపు భాగంలో ఒక నాళం పూడుకుపోయి రక్తం సరఫరా ఆగిపోయిందట. వెంటనే వాళ్లు రిఫర్ చేసిన మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆంజియోగ్రామ్ చేశారు. హార్ట్ ఎటాక్ అంటే ఎడమవైపు మాత్రమే నొప్పి వస్తుంది కదా? అని వైద్యులను అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన సమాధానమేంటంటే.. హార్ట్ ఎటాక్ వల్ల ముఖంలోని దవడ నుంచి గుండె కింది భాగం వరకు ఎక్కడైనా నొప్పి రావొచ్చట! తనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు’ అని సనా చెప్పుకొచ్చింది. ఇంత పెద్ద గండం నుంచి బయటపడ్డామనుకునేలోపే తన పెంపుడు శునకం రాక్సీ చనిపోయిందంటూ సనా కన్నీళ్లు పెట్టుకుంది.