త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఫొటోస్ వైరల్.
చరిత్రలో ఒక్కరోజులోనే కుంభమేళాకు ఇంత మంది ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు అధికారులు. ఈ సారి రికార్డు స్థాయిలో రద్దీ నెలకొంది. మహా కుంభమేళాకి మరో 23 రోజుల సమయం ఉంది. మిగిలిన ఈ రోజుల్లో కనీసం మరో 5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కేవలం దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ సారి ఎక్కువగా తరలి వస్తుండడం విశేషం. అయితే తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సంయుక్త మేనన్ మహా కుంభమేళాను దర్శించుకుంది.
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. అనంతరం ఇందుకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘జీవితంలో విశాలతను మనం కళ్లారా చూసినప్పుడు దానికి మించింది మరోకటి లేదు అనిపిస్తుంది. అనంతమైన స్ఫూర్తి కోసం నా సంస్కృతిని నేను ఎంతో ఆదరిస్తాను. మహా కుంభ మేళాలో భాగంగా గంగా నదిలో పవిత్రమైన స్నానం చేస్తున్నప్పుడు నా మనసు మరింత తేలికపడింది’ అని తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సంయుక్త మేనన్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. మొదటి సినిమాలోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆమె నటించిన విరూపాక్ష ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కల్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ తో సర్ సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి.
దీంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుందీ అందాల తార. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తోన్న స్వయంభు సినిమాలో నటిస్తోంది సంయుక్త. దీంతో పాటు మరికొన్ని తమిళ్, మలయాళ ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.