రోజ్ టీ తో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు, ఎలా చెయ్యాలో తెలుసుకోండి.
రోజ్ టీ అనేది ఒక ప్రసిద్ధ మూలికా పానీయం, ప్రత్యేక రుచి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రోజ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడే సమ్మేళనాలు. ఇది మంటను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రోజ్ టీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శక్తిని కూడా అందిస్తుంది. అయితే ఉదయం లేవగానే టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. టీ తాగితే కానీ రోజు మొదలవ్వదు కొందరకి. ఒక్కరోజు టీ తాగకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్‌లో ఉంటారు.
అయితే టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లే, మోతాదుకు మించి తాగితే దుష్ప్రభావాలు కూడా ఉంటాయని తెలిసిందే. అందుకే చాలా మంది ఈ మధ్య గ్రీన్ టీని తాగడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అయితే గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు జరగుతుందని, బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిసినా.. రుచి కారణంగా చాలా మంది ఈ టీని తీసుకోవడానికి అయిష్టత చూపిస్తుంటారు. అయితే ఈ గ్రీన్‌టీ రోజ్ టీగా మార్చుకోవడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు. ఎలా తయారు చేసుకోవాంటే..రోజ్‌టీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి అందులో నీటిని పోయాలి.
అనంతరం నీరు మరిగిన తర్వాత అందులో ఎండిన గులాబీ రేకుల వేయాలి. నీటిని బాగా మరగనివ్వాలి. అనంతరం బాగా మరిగిన ఆ నీటిలో తేనె వేసి కలపాలి. అనంతరం ఒకకప్పులోకి ఆ నీటిని వడకట్టి తీసుకోవాలి. అనంతరం ఈ రోజ్ వాటర్‌లో గ్రీన్ టీ బ్యాగ్ వేసుకోవాలి. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత గ్రీన్ టీ బ్యాగ్‌ను తీసి పక్కన పడేయ్యాలి. అంతే రోజ్ టీ రడీ అయినట్లే. అయితే ఇదంతా ఎందుకు అనుకుంటే ఇటీవల మార్కెట్లో రోజ్ గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసుకోవచ్చు.
రోజ్ టీతో లాభాలు.. ఇక రోజ్ టీని నిత్యం తాగడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. ప్రమాదకరమైన ఫ్రీ రాడకల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పొందుతుంది. నిత్యం దగ్గు, జలుబు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడే వారు రోజ్‌టీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక రోజ్‌టీని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజు ఉదయం ఒక కప్పు రోజ్ టీని తాగితే ఒత్తిడి దూరమవుతుంది. శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి, నిద్రలేమితో బాధపడే వారు రోజు రోజ్ టీని అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మహిళల ఆరోగ్యానికి కూడా రోజ్ టీ మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం రోజ్ టీ తాగే మహిళలల్లో బుతుక్రమ సమస్యలు దరిచేరవని. ఆ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది.