వర్షం నీటిని నేరుగా తాగుతున్నారా..? క్యాన్సర్‌తో సహా ఎన్నో వ్యాధులు వస్తాయో తెలుసుకొండి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. అయితే వర్షాకాలం అంటేనే వ్యాధులు ప్రబలే కాలమని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. వర్షంలో తడిచినా, వర్షపు నీటిలో ఆడుకున్నా వివిధ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే వర్షం నీరు చూసేందుకు శుభ్రంగా కనిపించినప్పటికీ వీటిని నేరుగా తాగకూడదని తాజా అధ్యయనాలు తెల్పుతున్నాయి. నిజానికి మనమందరం వర్షం నీటిని స్వచ్ఛమైనవిగా భావిస్తాం.
కాని వర్షం నీటిలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, అందుకే వాటిని నేరుగా తాగకూడదని పరిశోధకులు చెబుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం.. వర్షం నీటిలో PFAS అంటే సింథటిక్ మూలకాలను పరిశోధకులు కనుగొన్నారు. ఇవి వాతావరణంలో వేల సంవత్సరాలుగా ఉన్నాయని, వీటిని శాశ్వత రసాయనాలంటారని పేర్కొన్నారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించిన కథనాల ప్రకారం.. స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధనల్లో భూమిపై పడిన వర్షం నీటిలో PFAS మూలకాలు ఉన్నట్లు తేలింది.
ఈ హానికరమైన రసాయనాల స్థాయి గత కొన్ని యేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ PFAS రసాయనాలు సంతానోత్పత్తి సమస్యలు, పిల్లల్లో పెరుగుదల లోపాలు, క్యాన్సర్‌తో సహా అనేక రకాల వ్యాధులను కలిగిస్తుంది. వీరి పరిశోధనలు ఇప్పటికీ పూర్తికానప్పటికీ.. తాగునీటిలో ఈ ప్రమాదకరమైన రసాయనాల ఉండటం ఆందోళనల కలిగించే విషయమని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ విధమైన ఫ్లోరిన్ ఆధారిత సమ్మేళనాల్లో 4,500 కంటే ఎక్కువ రసాయనాలు మనం వాడే నిత్యవసర వస్తువుల్లో కూడా ఉన్నాయి.
ప్యాకేజ్ ఆహారం, నాన్-స్టిక్ వంటసామాన్లు, పెయింట్లు మొదలైన వాటిలో ఈ విధమైన రసాయనాలు కనిపిస్తాయి. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే దట్టమైన పొగతో నేడు కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తూనే ఉంది. భూమిపై ఉన్న వాతావరణం ద్వారా వర్షం నీరు మేఘాలకు చేరే క్రమంలో కాలుష్యం కూడా మేఘాలకు చేరుతుంది. వీటితోపాటు వాతావరణంలో కొన్ని రేడియోధార్మిక రసాయనాలు కూడా కలుస్తాయి.
అందువల్ల పట్టణాలు, ఫ్యాక్టరీల పరిసర ప్రాంతాల్లో నివసించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షపు నీటిని తాగకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీరు తాగడానికి సురక్షితం కాదు. ఈ హానికరమైన పదార్ధాలు గత రెండు దశాబ్దాలుగా వాతావరణంలో మరింతగా పెరుగుతున్నట్లు పరిశోధనల్లో బయటపడింది. ఐతే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వర్షం నీరు స్వచ్ఛమైనదని, ఈ నీటిని తాగటం సురక్షితమని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.