రాగిజావ వల్ల ఉపయోగాలే కాదు, ఎక్కువగా తాగితే ఈ ప్రమాదాలు కూడా ఉన్నాయ్.
శరీరంలో నీటి శాతం తగ్గడంతో పాటు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే శరీరంలో చలువని పెంచేందుకు మన పూర్వీకుల జావను తయారు చేసుకుని తాగేవారు. మొదట్లో జవాల వాడకం తక్కువగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో వీటి ప్రాధాన్యత పెరిగింది. జవాలు చేసే ఉపయోగాలు తెలిసినప్పటి నుంచి వీటి వాడకం ఎక్కువైపోయింది. అయితే రోజూ రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. వివిధ సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు అంటున్నారు.
ఎందుకంటే రాగి జావ అద్భుతమైన పోషకాహార ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌ల వంటి అన్ని అవసరమైన స్థూలపోషకాలను కలిగి ఉంటుంది. దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్, సోడియం స్థాయిలను కలిగి ఉంటుంది. విటమిన్ సి, ఇ కూడా ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. రాగిజావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది.
ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందుతారు. రాగి జావను రోజూ తీసుకుంటే.. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు.. ట్రిప్టోఫాన్, అమైనో ఆమ్లాలు, సహజ సడలింపుగా పని చేసి.. మీకు విశ్రాంతిని అందిస్తుంది. అయితే రాగి జావను రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు. మీకు జీర్ణ సమస్యలు లేదా గ్లూటెన్ అలెర్జీలు ఉంటే నైట్ తీసుకోకండి.
రాగి జావ వల్ల కలిగే దుష్ప్రభావాలు..అధిక బరువు ఉన్నవారు లేదా మధుమేహం వంటి కొన్ని జీవనశైలి రుగ్మతలు ఉన్నవారు రాగిజావను తీసుకోవచ్చు. అయినప్పటికీ.. దీనిని మీరు ఎక్కువగా తీసుకుంటే.. కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి అంటున్నారు. అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశముంది. మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిది. బరువు పెరగాలనుకునేవారు దీనిని కొంచెంగా తీసుకోవచ్చు. కొందరికి దీని వల్ల అలర్జీ రావచ్చు. అలా ఏమైనా అనిపిస్తే.. మీరు వెంటనే దానిని తీసుకోవడం ఆపేయండి.