గర్భిణీ స్త్రీలు బొప్పాయి తింటే ప్రమాదమా..? వైద్యులు ఏం చెప్పారంటే..?
బొప్పాయిలో సమృద్ధిగా పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్, నీరు ఉన్నాయి. కానీ పచ్చి లేదా పండు బొప్పాయిలో రబ్బరు పాలు, పాపిన్ అనే రసాయన పదార్థాలు ఉంటాయి. గర్భం ధరించిన వాళ్ళు పచ్చి బొప్పాయి తీసుకుంటే అది శిశువు చుట్టూ ఉన్న పొరలను బలహీన పరుస్తుంది. దాని వల్ల గర్భస్రావం జరగడం నెలలు నిండకుండానే ప్రసవించడం వంటి ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి స్త్రీ తాను.. తల్లినవుతున్న సమయాన్ని చాలా మధుర అనుభూతిగా జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి గర్భం దాల్చినప్పటి నుంచి శిశువుకు జన్మనిచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అనారోగ్య సమస్యలను నెగ్లెక్ట్ చేయకుండా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే మనం చేసే అతి చిన్న పొరపాటు కూడా తీవ్ర సమస్యకు దారి తీయవచ్చు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా వాంతులు, వికారం, శరీర నొప్పులు వస్తాయి. అందుకే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. పోషకాహార పదార్థాలతో పాటు పండ్లను అధికంగా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఏ ఆహారం తినాలి. ఏ ఆహారానికి దూరంగా ఉండాలి అనే విషయాల గురించి మహిళలకు చాలా సలహాలు ఉన్నాయి. అయితే పండ్లు సమతుల ఆహారంలో భాగం అయినప్పటికీ గర్భిణీ స్త్రీలు తినకూడని పండ్లు కొన్ని ఉన్నాయి.
ముఖ్యంగా బొప్పాయి విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. బొప్పాయి తినాలని అనిపిస్తే సురక్షితమో కాదో తెలుసుకోవడం చాలా అవసరం. బొప్పాయి చాలా రుచికరమైన పండు. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. బొప్పాయిలోని ప్రొటీన్, డైటరీ ఫైబర్, కొవ్వులు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు బొప్పాయిని డైట్ లో భాగం చేసుకోవాలి. అయితే గర్భం దాల్చిన సమయంలో కొన్ని పండ్లను ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతుంటారు. పండిన బొప్పాయిలో బీటా కెరోటిన్, కోలిన్ ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు ఏ, బీ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మంచిది. ఈ మేరకు ఓ పరిశోధన సరికొత్త విషయాలను వెల్లడించింది.
అయితే పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం లేదా అకాల నొప్పి వస్తుంది. పాపైన్ ఎంజైమ్ దీనికి కారణంగా చెబుతున్నప్పటికీ.. దీనిని నిర్ధరించే పరిశోధనలు ఇప్పటివరకు జరగలేదు. అందుకే గర్భిణీలు పచ్చి బొప్పాయి తినకూడదని సూచిస్తున్నారు. కానీ పండిన బొప్పాయి గర్భధారణలో ప్రయోజనకరంగా ఉంటుంది.గర్భధారణ సమయంలో బొప్పాయితో పాటు ద్రాక్ష, ఫైనాపిల్ కు దూరంగా ఉండాలి. ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ జీర్ణం కావడంలో ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి గర్భ ధారణ సమయంలో ద్రాక్షను తినకూడదు. పైనాపిల్ గర్భస్రావానికి కారణమవుతుంది. కానీ దీని గురించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.. కాబట్టి మీరు దానిని తీసుకునే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి.