కర్నూలు జిల్లాలో ఓ రైతుకు దొరికిన విలువైన వజ్రం, దాని ధర ఎంతో తెలుసా..?
ఎవరో నక్క తోక తొక్కిన వారికి వజ్రాలు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. వారి దరిద్రం పోయి లక్షాధికారులు, కోటీశ్వరులుగా మారుతుంటారు. తొలకరి వర్షాల సమయంలో రాయలసీమ జిల్లాలలో కొందరు గొర్రెల కాపరులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసుకునే రైతులకు వజ్రాలు దొరికిన అనేక ఉదంతాలు ప్రతీ సంవత్సరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
అయితే కర్నూలు జిల్లాలో ఓ రైతు పంటపడింది. పొలంలో అతడికి విలువైన వజ్రం దొరికింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన రైతు పనుల నిమిత్తం పొలం వెళ్లగా.. అతనికి వజ్రం దొరికింది. ఈ విషయం తెలియడంతో పెరవలికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి 8 లక్షల రూపాయలు ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు.
ఇటీవలే జొన్నగిరికి చెందిన మరో రైతుకు వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి నాణ్యతను చెక్ చేయించాడు. విలువైన వజ్రం అని తెలియక అతను 2 లక్షలకే ఓ వ్యాపారికి అమ్మేశాడు. ఆ తర్వాత ఆ వజ్రం చాలా విలువైనదని తెలిసింది. తొలకరి తర్వాత వర్షాలు మొదలుకాగానే కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలవుతుంది.
పొలాలు, కొండల వెంట స్థానికులతో పాటూ చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా జనాలు వచ్చి గాలిస్తుంటారు. ఒక్క వజ్రమైనా దొరక్కపోతుందా.. తమ జీవితం మారకపోతుందా అన్న ఆశతో వజ్రాల వేటలో మునిగిపోతారు. ఈ సీజన్‌లో కూడా చాలామంది రైతులు, కూలీలకు వజ్రాలు చిక్కాయి. కొన్ని వజ్రాలకు భారీ ధర పలికింది.
ఈ వజ్రాలను దక్కించుకునేందుకు వ్యాపారులు కూడా అక్కడే మకాం పెట్టారు. వజ్రం దొరికిందని తెలిస్తే చాలు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.