ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోయిందని ఆందోళన చెందుతున్నారా..? వెంటనే పెరగాలంటే..?
ప్లేట్ లెట్లు తగ్గిపోవటం కారణంగా చివరకు చాలా మంది ప్రాణాపాయ స్ధితికి చేరుతున్నారు. ప్లేట్ లెట్ల సంఖ్య ఎంత ఉండాలి, ఎంతకు పడిపోతే ప్రమాదం…ప్లేట్ లెట్లు ఎవరికి అవసరం, ఎవరికి అవసరం ఉండదు అనే విషయాలు చాలా మందికి తెలియక అనేక అపోహలకు లోనవుతున్నారు. అయితే సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. ప్లేట్లెట్ల సంఖ్య పది వేలకు తగ్గే వరకు ఏ లక్షణాలు కనిపించవు.
ఒకవేళ అంతకన్నా తక్కువగా పడిపోతే మాత్రం శరీరంలోని వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం ఏర్పడుతుంది. శరీరంలో ప్లేట్లెట్స్ ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్ లెట్స్ ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదంటున్నారు నిపుణులు. ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య 3-4 లక్షల వరకూ లేదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది 80 వేల వరకూ పడిపోయినా ఎటువంటి నష్టం లేదు.
కానీ 20 వేలకంటే దిగువకు పడిపోయినప్పుడు మాత్రం ప్రమాదకరంగా భావిస్తారు. పది వేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్లెట్స్ సంఖ్య చాలా వేగంగా పడిపోతు ఉంటుంది.. వీరికి డెంగ్యు చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్ లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్లేట్ లేట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో నియంత్రణలోకి వస్తాయి. సహజంగా ప్లేట్ లెట్స్ పెంచుకునే మార్గాలు.. బొప్పాయి చెట్టు లేత ఆకుల రసం.
ఇది చాలా సులభం. లేత ఆకుల్నించి ఎప్పటికప్పుడు కొద్దిగా రసాన్ని సేకరించాలి. 5 ఎంఎల్ నుంచి 10 ఎంఎల్ వరకూ ప్రతిరోజూ ఉదయం , రాత్రి తీసుకుంటే చాలా వేగంగా ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఫుడ్ ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుతుంది. క్యారెట్, స్వీట్ పొటాటో, కేల్, గుమ్మడిని తినడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి. క్యాప్సికమ్ తినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. దానిమ్మని రెగ్యులర్గా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది.
కాబట్టి ప్లేట్లెట్స్ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గోధుమ గడ్డిలో కాస్తా నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్ తినడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. బీట్రూట్ శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. ఈ కూరగాయని కూడా ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది.