పేగుల్లోని చెడు బ్యాక్టీరియా చేరితే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
కడుపు, పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను అభివృద్ధి చేసుకుంటూ చెడు బ్యాక్టీరియాను తగ్గించుకుంటే వయసు మీదపడ్డా కూడా ఆరోగ్య సమస్యలు పెద్దగా రావు. అయితే పేగుల్లోని బ్యాక్టీరియా మంచే కాదు, చెడూ చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేయటం వల్ల తలెత్తే సమస్యలు, పేగుల్లో పూత, జీవక్రియ రుగ్మతలు, కుంగుబాటు వంటి జబ్బులనూ తెచ్చిపెడుతుంది. ఇలాంటి దుష్ప్రభావాలకు బ్యాక్టీరియా పేగులను దాటుకొని రావటం (లీకీ గట్) కారణమని భావిస్తుంటారు.
కానీ జబ్బుల ఆనవాళ్లేమీ కనిపించనీయకుండా ఆరోగ్యవంతుల్లో ఈ హానికర బ్యాక్టీరియా ఎలా మనగలుగుతుందనేది అంతు చిక్కని ప్రశ్న. పేగుల్లోని బ్యాక్టీరియా క్రమంగా రెండు వేర్వేరు రకాలుగా మారుతున్నట్టు యేల్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఒక రకమేమో పాత బ్యాక్టీరియా మాదిరిగానే ప్రవర్తిస్తుండగా.. మరో రకంలో డీఎన్‌ఏ మారిపోతున్నట్టు వారు కనుగొన్నారు. దీంతో ఇది పేగుల్లోని జిగురు పొరల్లో జీవించే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. అంతేకాదు.. పేగుల్లోంచి బయటపడ్డాక లింఫ్ గ్రంథులు, కాలేయంలోనూ మనగలుగుతోంది.
ఇది తాత్కాలికంగానైనా రోగనిరోధక వ్యవస్థను తప్పించుకొని అవయవాల్లో జీవిస్తుందట. క్రమంగా వాపు ప్రక్రియను ప్రేరేపించి స్వీయ రోగనిరోధక సమస్యలను తెచ్చిపెడుతోంది. వ్యాధికారక బ్యాక్టీరియా ఉన్నప్పటికీ కొందరికి ఎన్నడూ జబ్బులు రాకపోవటానికి, కొందరికి వయసు మీద పడుతున్నకొద్దీ జబ్బులు తలెత్తటానికి కొంతవరకిది కారణం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాధులు కలగజేసేలా బ్యాక్టీరియా మారటానికి పేగుల్లోని వాతావరణం కూడా ఒక కారణం. మంచి ఆహారం తినేవారిలో రకరకాల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. వీటి మధ్య పోరాటంలో హానికారక బ్యాక్టీరియా తగ్గుతుంది.
పేగుల్లోంచి బయటపడే అవకాశము తగ్గిపోతుంది. అదే తక్కువ వైవిధ్యం గల బ్యాక్టీరియా ఉన్నట్టయితే హానికారకంగా పరిణమించే వాటి సంఖ్య పెరిగే ప్రమాదముంటుంది. ఇలా జరగకూడదు అంటే.. ఆరోగ్యానికి హాని చేసేవి కాకుండా మేలు చేసేవి తినాలి. ఎక్కువగా శీతలపానియాలు, మద్యం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పదార్థాలు, ఫ్రీరాడికల్స్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకుకూరలు, పండ్లు, స్ర్పౌట్స్, ఎండువిత్తనాలు, పొట్టుతియ్యని బియ్యం, పప్పు ఇలాంటివి డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు.!!