పేద రైతులకు సాయం విషయంలో పల్లవి ప్రశాంత్ నాటకాలు, ఒక్క లక్షతోనే..?
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో గత ఏడాది ప్రసారం అయింది. ఇందులోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత అతడు అదిరిపోయే ఆటతో మెప్పించాడు. ఇలా కోట్ల మంది హృదయాలను గెలుచుకుని ప్రశాంత్ ఏడో సీజన్ విజేతగా మారాడు. అయితే తాను షో కి వచ్చిందే రైతుల కోసమని .. పేద రైతులకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలుస్తానని చెప్పుకొచ్చాడు.
తీరా విన్నర్ అయ్యాక ఇచ్చిన మాట పక్కన పెట్టేశాడు. నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో సహాయం చేయలేదు. బిగ్ బాస్ ముగిసి నాలుగు నెలలు గడిచినా రైతులకు పంచాల్సిన డబ్బు గురించి ప్రశాంత్ ఎక్కడా ప్రస్తావించలేదు. తన పని తాను చేసుకుంటూ సైలెంట్ అయిపోయాడు. పేదలకు పంచిన ప్రతి రూపాయి లెక్క తో సహా వీడియోలు చేసి పెడతానని చెప్పి ఆ ఊసే ఎత్తలేదు. పైగా నన్ను సీఎం ని చేయండి రైతులను ఆదుకుంటానంటూ వ్యాఖ్యలు చేశాడు.
దీంతో పల్లవి ప్రశాంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. చేస్తానన్న సాయం మరచిపోయి జల్సాలు చేస్తున్నావ్. రైతులకు ఇంకెప్పుడు సహాయం చేస్తావ్ అంటూ జనాలు నిలదీశారు. దీంతో ఇటీవల ఇచ్చిన మాట ప్రకారం మొదటి సాయం చేశాడు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ నిరు పేద రైతు కుటుంబానికి లక్ష రూపాయలు అందించాడు. పైగా షో నుంచి రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చాయని అందుకే లేట్ అయిందని చెప్పుకొచ్చాడు.
కాగా ప్రశాంత్ మొదటి సాయం చేసి ఇప్పటికే రెండు వారాలు గడిచింది. ఇంతవరకు మరో రైతుకు సాయం చేసిన దాఖలాలు లేవు. పైగా సహాయం కోసం తన ఇంటికి ఎవరూ రావద్దని ప్రశాంత్ విజ్ఞప్తి చేశాడు. తాను, తన టీం కలిసి ఎవరికి డబ్బు అవసరమో తెలుసుకుని పంచుతాము అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రశాంత్ మాటలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. అసలు ఈ కార్యక్రమం పూర్తి చేస్తాడా లేక గతంలో కౌషల్ మాదిరి మాయమైపోతాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.