ఆకలి లేకున్నా తింటున్నారా..? ఈ రోగాలు మీకు ఖచ్చితంగా రావడం ఖాయం.
ఈ రోజుల్లో చాలా మంది ఫిట్ గా ఉండటానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఫిట్ గా ఉండాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా.. సరైన డైట్ కూడా తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే బరువు తగ్గడానికి ఆహారం మాత్రమే 70 శాతం వరకు పనిచేస్తుంది. ఆహారం అంటే తినడమే కాదు, సరైన సమయంలో, సరైన పరిమాణంలో తినడమని అర్థం. ఆకలి లేనప్పుడు కూడా తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
భావోద్వేగ ఆహారం.. ఒత్తిడి, ఆందోళన లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలకు లోనైనప్పుడు కూడా చాలా మంది ఆకలి లేకున్నా తింటుంటారు. విసుగు చెందడం.. కొంతమంది విసుగును పోగొట్టడానికి తింటుంటారు. ముఖ్యంగా టైం పాస్ కోసం కూడా ఇలా తింటుంటారు. దానికి అలవాటు పడటం.. చాలా మందికి, నిర్దిష్ట సమయాల్లో తినడం అలవాటుగా మారుతుంది. ఇలాంటప్పుడే ఆకలి లేకున్నా తింటుంటారు. ఎందుకంటే ఇలా తినడం వీరికి అలవాటు ఉంటుంది.
సామాజిక ఒత్తిడితో.. పది మందిలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆకలి లేకున్నా ఇతరుల ఒత్తిడి, బలవంతం వంటి కారణాల వల్ల తినాల్సి వస్తుంది. ఆహార కోరిక.. కొన్నిసార్లు ఆకలి లేకున్నా ఫుడ్ ను తినాలన్నా కోరిక పడుతుంది. ఆకలి లేకున్నా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే.. వేగంగా బరువు పెరగడం.. ఎలాంటి కారణం లేకుండా తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రోజువారీ అవసరాల కంటే ఎక్కువ కేలరీలను ఇస్తుంది.
ఇది మీ శరీరంలో అదనపు బరువు రూపంలో నిల్వ చేయబడుతుంది. గుండె జబ్బులు.. ఆకలి లేకున్నా తినే అలవాటు ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి వారికి గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు.. ఆకలి లేకుండా తినడం అంటే అవసరానికి మించి ఆహారాన్ని తినడమన్నట్టే.
ఈ అలవాటు జీర్ణ సమస్యలకు ప్రధాన కారణం కావొచ్చు. ఈ కారణంగా కడుపులో ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఆకలి లేనప్పుడు తినడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల మీకు ఎప్పుడూ ఒత్తిడి, కోపం, బద్ధకం, అలసట, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.