గుండె లేకుండా ఇతను నెల రోజులు బతికాడు, ఎలానో మీరే చుడండి.
గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపబతుతోంది. అయితే గర్భంలో పిండం పురుడు పోసుకున్నాక మొదట ఏర్పడే అవయవం గుండె. గుండె కొట్టుకునే వేగాన్ని నెలన్నర గర్భం నుంచే తల్లికి వినిపించడం మొదలుపెడతారు వైద్యులు.
గుండె సరిగా ఏర్పడక పోతే ఆ గర్భాన్ని తీసేస్తారు కూడా. అసలు గుండె లేకుండా ఏ మనిషైనా జీవించగలడా? అనే సందేహం కూడా ఎంతో మందికి ఉంది. అయితే ఓ వ్యక్తి గుండె లేకుండా నెల రోజులు జీవించాడు. అదే ఇప్పటికీ రికార్డు. ఇది జరిగి చాలా ఏళ్లయింది. అతడు ప్రపంచంలోనే గుండె లేని, పల్స్ లేని వ్యక్తిగా పేరు పొందాడు. 2011లో క్రెయిగ్ లూయిస్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.
అతని వయసు అప్పుడు 55ఏళ్లు. అతను ‘అమిలోయిడోసిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇందులో ప్రొటీన్ అసాధారణంగా పెరిగిపోతోంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం పనిచేయడం ఆగిపోతాయి. అతనికి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా శ్రమించారు. గుండె పనిచేయలేక ఆగిపోయే దశకు చేరుకుంది. ఆ సమయంలో గుండెు తొలగించి దాని స్థానంలో ఒక పరికరాన్ని అమర్చారు.
పల్స్ లేకపోయినా శరీరమంతా రక్తన్ని ప్రసరించేలా చేయగలదు. టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నుండి డాక్టర్ బిల్లీ కోన్, డాక్టర్ బడ్ ఫ్రేజియర్, పల్స్ లేకుండా రక్త ప్రసరణకు సహాయపడే పరికరాన్ని రూపొందించారు. తయారు చేశాక దాన్ని 50 ఆవు దూడలపై పరీక్షించారు. వాటి గుండెను తొలగించి ఈ పరికరాన్ని పెట్టి, ఎలా పనిచేస్తుందో చెక్ చేశారు. ఆ దూడలు సాధారణంగానే తమ పని తాము చేసుకోవడం ప్రారంభించాయి. దీంతో ఈ పరికరం ప్రయోగం సక్సెస్ అయింది. ఆ గుండెలోని దూడల ఛాతీపై స్టెతస్కోప్ పెడితే ఎలాంటి గుండె చప్పుడు వినిపించదు.
ఈసీజీ చెక్ చేసిన తిన్నని గీతలు తప్ప ఇంకేమీ రావు. అయినా ఆ పరికరం శరీరమంతా రక్తాన్ని ప్రసరించేలా చేస్తుంది. అదే పరికరాన్ని లూయిస్‌కు అమర్చారు. అతను మరొక 12 గంటలు బతికే ఛాన్సు ఉందని వైద్యులు చెప్పడంతో అతని భార్య లిండా ఆ పరికరాన్ని గుండె స్థానంలో అమర్చేందుకు ఒప్పుకుంది. కానీ విచిత్రంగా లూయిస్ ఈ పరికరం సాయంతో నెలరోజులు బతికాడు. అతను మరణించిన కారణం కూడా ఈ పరికరం కాదు, కాలేయం పూర్తిగా వైఫల్యం చెందడంతో మరణించాడు. అయితే గుండె లేకుండా, పల్స్ లేకుండా జీవించిన వ్యక్తిగా లూయిస్ వైద్య చరిత్రలో మిగిలిపోయాడు.