రాత్రి ఈ భంగిమలో పడుకుంటే చాలా ప్రమాదం, ఎలాగంటే..?
సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెల మాడవ శుక్రవారం నాడు ప్రపంచ నిద్ర దినోత్సవం జరుపుకుంటారు. అయితే శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. చాలామంది నిద్రను తగ్గించేస్తుంటారు.
దీని వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే నిద్రపోయే భంగిమ కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. మన శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే, కొన్ని రకాల అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే… నిద్రించే భంగిమల గురించి తెలుసుకోవాలి. మనం నిద్రించే భంగిమ మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే గాఢ నిద్ర పట్టడంపై కూడా ప్రభావం చూపిస్తుంది. మీకు గాఢ నిద్ర పట్టలేదు అంటే మీరు నిద్రించే భంగిమ సరిగా లేదు అని అర్థం. కొందరికి నిద్రలో మెడ పట్టేయడం, పొట్ట నొప్పి రావడం లాంటివి జరుగుతాయి.
ఇవన్నీరావడానికి కారణం సరియైన భంగిమలో పడుకోకపోవడమే.ఏ భంగిమలో పడుకుంటే మంచిదో తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అలాగే ఏ భంగిమలో పడుకోకూడదో కూడా తెలుసుకోవాల్సిన అవసరం అంతే ఉంది. ఎలా నిద్రపోకూడదు.. చాలామందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. అలా నిద్రించకూడదని ఆయుర్వేదం నుంచి అలోపతి వరకు అన్ని వైద్యశాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు అలా నిద్రించడం వల్ల ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితి నిద్రలోనే సంభవిస్తుంది. అలా నిద్రించడం వల్ల శరీరంలోని ముఖ్యమైన భాగాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. వెన్నుపూస, ఎముకలు, ఊపిరితిత్తులు తీవ్రంగా ఒత్తిడికి లోనవుతాయి. ఒక్కోసారి నిద్రలోనే శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. కాబట్టి బోర్లా పడుకోవడం అనేది పూర్తిగా నిషేధించాలి.
అలాగే బోర్లా పడుకున్నప్పుడే నడుము నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి మీకు బోర్లా పడుకునే అలవాటు ఉంటే, దానిని వెంటనే మానేయండి. అలాగే కుడి వైపు తిరిగి పడుకుంటారు కొంతమంది. ఇది కూడా శరీరంపై మంచి ప్రభావాన్ని చూపించదు.కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్, ఎసిడిటి, తేన్పులు రావడం వంటి సమస్యలను పెంచుతుంది. కాబట్టి కుడివైపు పడుకోవడాన్ని కూడా వీలైనంతవరకు నివారించాలి. ఎలా పడుకోవాలి.. వైద్యశాస్త్ర అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఎడమవైపు తిరిగి పడుకోవడం అన్ని విధాలా మంచిది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలోని ఏ అవయవం పైన కూడా ఒత్తిడి పడదు. అలాగే కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయని చెబుతారు.
జీర్ణాశయంపై ఒత్తిడి ఉండదు, కనుక రాత్రి పూట జీర్ణ వ్యవస్థ చక్కగా తన పని తను చేసుకుంటుంది. దీనివల్ల రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. పెద్ద పేగులో ఆహారం కదలికలు చురుగ్గా ఉంటాయి. పొట్ట శుభ్రపడుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు ఎడమవైపే పడుకోవడం చాలా మంచిది. వీరికి ఎసిడిటీ సమస్యలు, పొట్టసంబంధ సమస్యలేవీ రాకుండా ఉంటాయి.నడుము నొప్పి, వెన్ను నొప్పి కూడా రావు. శ్వాస సంపూర్ణంగా ఆడుతుంది. గురక వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి వీలైనంతవరకు ఎడమ వైపు నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇలా నిద్రపోవడం వల్ల ఎలాంటి అలసటగా కూడా అనిపించదు.