రాత్రి నిద్ర సరిగా రావడం లేదా..? మీకు తొందరలోనే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
నిద్ర..ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. అయితే ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. 17 సంవత్సరాల యువకులు కూడా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. మారిన జీవనశైలితోపాటు, సరైన నిద్ర లేకపోవడం కూడా గుండెపోటుకు దారితీస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి గుండెపోటు, ఆస్తమా, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
మంచి నిద్ర అంటే ఏమిటి.. రాత్రిపూట 7 నుంచి 9 గంటల నిద్రపోతే దాన్ని మంచి నిద్ర అంటారు. రోజు రాత్రిళ్లు ఒకే సమయంలో నిద్రపోవడం అనేది కూడా చాలా ముఖ్యం. 5 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి పగటి నిద్ర అవసరం లేదు. కోవిడ్-19 సమయంలో చాలా మంది నిద్రకు దూరమయ్యారు. కరోనా మహమ్మారి జనాల నిద్రా విధానాలకు అంతరాయం కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది కరోనా కారణంగా నిద్రకు దూరమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది అత్యధిక సంఖ్యలో నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిలో 36 శాతం మంది సాధారణం కంటే తక్కువ నిద్రపోతున్నారు.
కోవిడ్-19 వ్యాధితో బాధపడుతున్న 74.5 శాతం మంది ఆరోగ్య పరిస్థితి కారణంగా మంచి నిద్రను కోల్పోయారు. నిద్ర కోల్పోయిన వారిలో వీరు అగ్రస్థానంలో నిలిచారు. తగ్గిన నిద్ర ప్రభావం.. నిద్రలేమి అనేది జనాభాలో గుండెపోటు, మానసిక వ్యాధులు, హైపర్‌టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం పెరగడానికి దారితీస్తున్నాయి. సరిగా నిద్ర పోకుంటే మనుషుల్లో ఆందోళన, భయాందోళనలకు గురవుతారని డాక్టర్లు చెబుతున్నారు. నిద్ర మంచి ఆరోగ్యానికి కొలమానం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం మంచి నిద్ర అనేది సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది.
అలసిపోయిన శరీరాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుందని డాక్టర్లు గుర్తుచేస్తున్నారు. ప్రజల మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర అనేది జీవసంబంధమైన అవసరం. నిద్ర జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. నేర్చుకోవడం సులభం చేస్తుందని సీనియర్ ENT సర్జన్, స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కిషోర్ వివరిస్తున్నారు. మంచి నిద్ర మన జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. మంచి నిద్ర, పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. సాంకేతిక యుగంలో, గాడ్జెట్‌లు మన జీవితాన్ని శాసిస్తున్నందున నిద్ర బాగా ప్రభావితమైందనీ, అది నిద్ర నాణ్యతను ప్రభావితం చేసిందని నిపుణులు చెబుతున్నారు.
మంచి నిద్రకు చిట్కాలు.. మంచి నిద్ర, పరిశుభ్రత చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రించాలి. నిద్రపోయే సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించవద్దు. పడకగదిని నిద్ర కోసం మాత్రమే ఉపయోగించాలి. నిద్రపోయే సమయానికి 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. నిద్రకు ముందు చిన్నపాటి నడక లేదా 30 నుంచి 60 నిమిషాల ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర సమస్యలు తొలగిపోతాయి. సాయంత్రం 6 గంటల తర్వాత టీ లేదా కాఫీలకు దూరంగా ఉండాలి. నిద్రకు ముందు గోరు వెచ్చిన గ్లాసు పాలు తాగితే వెంటనే నిద్ర ముంచుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు.