రాత్రి పీడకలలు వస్తున్నాయా..? అది దేనికీ సంకేతమంటే..?
కలలు రావడం వల్ల మీరు రాత్రంతా జాగరణ చేయాల్సి వస్తుంది. నిద్రమొత్తం భంగం అవుతుంది. నిద్రపోతున్నట్లే ఉంటుందిగానీ మీరు మధ్యమధ్యలో ఉలిక్కిపడి లేవడం, అలాగే నిద్రలో అటుఇటు పొర్లాల్సి వస్తుంది. అయితే రాత్రి కునుకుపట్టి గాఢనిద్రలోకి జారుకునే సరికి పీడకలలు రావడం మొదలవుతాయి. ఎవరో తరుముతున్నట్టు, పాము వెంటపడుతున్నట్టు, లేదా దయ్యాలు భూతాలు కనిపించినట్టు, ఎవరో తమను చంపడానికి వస్తున్నట్టు… ఇలా భయపెట్టే కలలు కలవరాన్ని పెంచేస్తాయి.
ఆ భయంతో మెలకువ వచ్చేస్తుంది కానీ ఇంకా అదే కల వెంటాడుతున్నట్టు ఉంటుంది. కొందరిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కానీ దీన్ని సీరియస్గా తీసుకునేవారు చాలా తక్కువ. అవే వచ్చి పోతాయిలే అనుకుంటారు. కానీ వాటిని పట్టించుకోవాలని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హోమ్ పరిశోధకులు చెప్పిన ప్రకారం ఇలా తరచూ పీడకలలు వచ్చే వారికి మతిమరుపు లేదా డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువట. విషయాలు త్వరగా అర్థం కావని, కొన్నిసార్లు మర్చిపోవడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు.
ఇందుకోసం మూడు వేల మందికి పైగా వ్యక్తులపై పరిశోధన నిర్వహించారు. అందులో 35 నుంచి 78 ఏళ్ల వరకు వయసుగల వారు ఉన్నారు. మధ్యవయసు వారికి అంటే 38 దాటిన వారికి తరచూ పీడకలలు వస్తుంటే వారిలో మతిమరుపు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువని తేలింది. ఇక ముసలి వారికి పీడకలలు వస్తే వారిలో మతిమరుపు వచ్చే అవకాశం రెండు రెట్లు అధికమని తెలిసింది. ఆడవారి కన్నా మగవారిలోనే పీడకలల కారణంగా మతి మరుపు వచ్చే అవకాశం అధికమని చెప్పారు.
అయితే పీడకలలు మతిమరుపు వచ్చేలా చేయడానికి కారణాలు ఏంటో ఇంకా తెలుసుకోలేదు. దీనికి మరింత లోతైన అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని పీడకలలు మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిజజీవితంలో ఉన్న భయాలు కూడా పీడకలల రూపంలో వేధించవచ్చు. కాబట్టి పీడకలల కారణంగా నిద్రపట్టని పరిస్థితి ఉండడం, వాటి వల్ల ఒళ్లంతా చెమటలు పట్టడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. లేకుంటే వాటి వల్ల కలిగే భయం మానసిక సమస్యల తీవ్రంగా పడేలా చేస్తుంది. ఎక్కువ రోజులు సరిగా నిద్రలేకపోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు. కాబట్టి పీడకలలను తేలికగా తీసుకోవద్దు.