బై, బై రోజా అంటూ..! నగరిలో రోజా ఓటమిపై వైసీపీ మహిళా నేత సంబరాలు..!
రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నగరిలో రోజా ఓటమితో ఆమెపై అసమ్మతితో ఉన్న వర్గం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. సెల్ఫీ వీడియోతో తన ఆనందాన్ని పంచుకున్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి. పదేళ్లుగా ‘నగరికి పట్టిన శని విరగడైందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నగరిలోని తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాశ్ 45వేల పైచిలుకు మెజారిటీతో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఘన విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన రోజా మాత్రం 62,793 వేల ఓట్లే రాబట్టగలిగారు. ఈ క్రమంలో రోజా పరిస్థితి ‘అత్త తిట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు బాధ’ అన్న చందంగా మారింది.
ఓటమికి కారణాలు వెతుక్కుంటూ తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు రోజా, ఆమె వర్గం సిద్ధమవుతుంటే… మరోవైపు ఆమె వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. వైసీపీలోనే ఆమెకు అసమ్మతి తగలడం, ఆ వర్గం రోజా ఓటమిపై సంతోషం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాధను పంచుకోవాల్సిన, సానుభూతి చూపించి మద్దతుగా ఉండాల్సిన సొంత పార్టీ కేడరే… సంబరాలు చేసుకుంటుండటంతో నగరిలో రోజా పరిస్థితి దారుణంగా తయారైంది. నగరిలోని మంత్రి ఆర్కే రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రోజా ఓటమిపై ఆనందం వ్యక్తం చేస్తూ నగరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ మారింది. పదేళ్లుగా నగరికి పట్టిన శని విరగడైందంటూ ఆమె వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా కుటుంబ పాలనతో నగరి నియోజవకర్గంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు చేశారు. అందు వల్లే నగరి ప్రజలు రోజాను భూస్థాపితం చేశారని చెప్పారు. కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు వరకు.. మళ్లీ వైసీపీ వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు అంతా మౌనంగా ఉన్నారు. ఫలితాలు వెలువడక ముందే.. నగరిలో కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే రోజా వెళ్లిపోయారు.
ఆ తర్వాత నగరిలోని ఇంటికే పరిమితమయ్యారు. పోలింగ్ రోజు తన వ్యతిరేక వర్గంపై రోజా విమర్శలు గుప్పించారు. తన పార్టీ వాళ్లే తనకు సహకరించడం లేదని వాపోయారు. ఇప్పుడు బహిరంగంగా రోజా ఓటమిపై వీడియోలు విడుదల చేయడంపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి. నగరిలోని రోజా, శాంతివి వేర్వేరు వర్గాలు. మొదటి నుంచి ఒకరంటే మరొకరికి పడదు. సాక్షాత్తూ సీఎం జగనే వారిని కలపాలని చూసిన కుదరలేదు. అనేకసార్లు ఆర్కే రోజా, కేజే శాంతి వర్గాలు నేరుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నాయి.