కన్న కూతుర్ని వ్యభిచార గృహంలో అమ్మేసిన తల్లి, చివరకు ట్రీట్మెంట్ పొందుతూ..!
యువతులు, మహిళలకు మాయమాటలు చెప్పి బెంగళూరుకు తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వ్యభిచార గృహాలకు వారిని అమ్మేస్తారు. ఇలాంటి దుర్మార్గుల బారిన పడి బెంగళూరు వరకు వెళ్లిన ఓ మహిళ.. ఎలాగోలా తప్పించుకుని వచ్చి హైదరాబాద్‌లో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాకి చెందిన ఓ మహిళ డబ్బుల కోసం కక్కుర్తిపడి తన మైనర్ కూతుర్ని రెండు సార్లు వ్యభిచార గృహాల్లో అమ్మేసింది.
2021లో బీహార్ లోని ముజఫర్‌పూర్‌లోని వ్యభిచార గృహానికి తన కూతుర్ని మహిళ మొదట విక్రయించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమాచారం అందుకున్న ఓ ఎన్జీవో కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ముజఫర్‌పూర్ చేరుకుని బాలికను రక్షించారు. బాలిక తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చి బాలికకను తిరిగి ఆమెకు అప్పగించారు.
అయితే పోలీసుల ఎదుట పశ్చాత్తాపం నటించిన ఆ మహిళ తిరిగి 2022లో తన కుమార్తెను ఓ ఏజెంట్ ద్వారా ఉత్తర కోల్‌కతాలోని సోనాగాచి వ్యభిచార గృహానికి విక్రయించింది. ఇది ఆసియాలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాలలో ఒకటి. ఈసారి వ్యభిచార గృహ యజమాని, అక్కడ సందర్శించే వేర్వేరు కస్టమర్ల చేతిలో బాలిక లైంగిక దోపిడీకి గురైంది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆ వ్యభిచార గృహ యజమాని బాలికను విడిచిపెట్టాడు.
బాలికను ఆమె తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్జీవో సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాలికను తీసుకెళ్లి హాస్పిటల్ లో చేర్పించారు. అయితే డాక్టర్ల ప్రయత్నాలన్నీ ఫలించకపోవడంతో చివరకు ట్రీట్మెంట్ పొందుతూ గురువారం బాలిక మృతి చెందింది.