మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..?
మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగను పీల్చే వ్యక్తులకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనారి డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువనే చెబుతున్నారు వైద్యులు. ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ప్రతిరోజు ఆరుగురు వ్యక్తులు ఈ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధికి కారణమై ప్రాణాలు కోల్పోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల వర్షం నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయి. దీంతో చాలా మంది ఇళ్లల్లో దోమల బెడదతో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు చాలా మంది డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు.
డెంగ్యూ జ్వరానికి దోమలే ప్రధాన కారణం. దోమల బారిన పడకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. దోమలను చంపడానికి దుకాణాల్లో వివిధ ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ తమ ఇళ్లలో మస్కిటో కాయిల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే దోమలను చంపేందుకు ఉపయోగించే మస్కిటో కాయిల్ నుండి వెలువడే పొగలను ఎక్కువగా పీల్చినప్పుడు, అది ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మస్కిటో కాయిల్స్‌లోని పదార్థాలు తలనొప్పిని ప్రేరేపిస్తాయి.
అందుకే చాలా మందికి దోమల నివారణ మందు వాసన చూసిన తలనొప్పి వస్తుంది. దోమలను చంపడానికి దోమల మందు వాడటం అంత మంచిది కాదు. వీలైనంత వరకు దాని వినియోగాన్ని తగ్గించండి. మస్కిటో కాయిల్ ద్వారా చర్మంపై దద్దుర్లు, మంటను కలిగించే పదార్థాలు ఉంటాయి. మంట ఉన్నవారు దోమల నివారిణ కోసం దానిని వాడకూడదు. అది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. చర్మంపై దారుణంగా ప్రభావం చూపుతుంది. దోమలను చంపడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్స్‌లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి.
ఈ క్యాన్సర్ కారకాలను శ్వాసించడం కొనసాగించినప్పుడు, అది ఊపిరితిత్తులలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదల చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రస్తుతం చాలా మంది ఆస్తమా, సీఓపీడీ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత కలుషిత వాతావరణం. అయితే, మీరు దోమలను చంపడానికి ఇంట్లో ప్రతిరోజూ కాయిల్ ఉపయోగిస్తే దాని పొగను పీల్చినట్లయితే మీరు ఆస్తమా, శ్వాస సమస్యలు, దగ్గుతో బాధపడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పిల్లలు ఉంటే వీలైనంత వరకు దోమల మందును వాడకపోవడం మంచిది.
రోజూ మస్కిటో కాయిల్‌ను వెలిగించి అందులోని పొగను పీల్చితే, రసాయనాలు పిల్లల్లో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగించి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దోమలు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల దోమల తెర దొరుకుతున్నాయి. అది మీరు పడుకునే ప్రదేశం చుట్టూ కట్టుకోండి. లేకపోతే సహజసిద్ధమైన మార్గాల ద్వారా దోమలను తరిమికొట్టవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మస్కిటో కాయిల్ వాడకుండా ఉండండి.