మొలకెత్తిన పెసలు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
పెసలను మన పూర్వికులు అధికంగా వినియోగించేవారు. మూంగ్ దాల్ గా వీటిని స్నాక్ ఐటమ్ వినియోగిస్తారు. కూరల్లో పెసలు వాడతారు. రుచికరంగా ఉండే పెసర దోశలను తినేందుకు చాలా మంది ఇష్టపడతారు..పెసలను నీటిలో నానబెట్టి తరువాత వాటిని మొలకెత్తించి తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. మొలకెత్తిన పెసర గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసరపప్పును తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పప్పుల్లో మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. మొలకెత్తిన పెసరపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్, విటమిన్-సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పప్పులను తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఈ పప్పు మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.. ఫైబర్ కంటెంట్ మెండుగా ఉండే పెసరపప్పు మొలకలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ పప్పును తింటే ఎసిడిటీ, కడుపు నొప్పి, పుల్లని త్రేన్పులు వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. చర్మానికి మేలు చేస్తుంది.. ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మొలకెత్తిన పెసరపప్పు తింటే మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ పప్పు చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. కంటి చూపును పెంచడానికి.. మొలకెత్తిన పెసరపప్పులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఈ విటమిన్ మన కళ్లకు మేలు చేస్తుంది. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే కంటిచూపు పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా.. మొలకెత్తిన పెసరపప్పును తింటే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.
దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా వీటిని మోతాదులోనే తినాలి. రక్తహీనత సమస్య..మొలకెత్తిన పెసరపప్పులో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. ఈ పప్పులను తింటే శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య పోతుంది. అయితే ఆహారాలను తినే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మర్చిపోకండి.