Health

మగవారి కంటే ఆడవారే ఎక్కువ కాలం జీవిస్తారు, ఆ రహస్యం ఏంటో తెలుసా..?

నిన్నటి వరకూ మనతో జాలీగా తిరిగన వ్యక్తి.. ఈ రోజు లేడంటే నమ్మలేని పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఉంటామో.. ఎప్పుడు పోతామో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే వారు సైతం సడన్ గా హార్ట్ ఎటాక్ లు, పలు కారణాలతో మృత్యువాతపడుతున్నారు. అయితే అందరూ మనుషులే అయినప్పటికీ మగవారు, ఆడవారు ప్రతి అంశంలో భిన్నంగా ఉంటారు. స్త్రీ, పురుషుల శరీరాల విషయానికి వస్తే స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ కండరాలు కలిగి ఉంటారు, ఎత్తుగా దృఢంగా ఉంటారు, వేగంగా పరుగెత్తగలరు, ఎక్కువ బరువులు మోయగలరు. ఈ అంశాలను బట్టి మగవారు బలవంతులు, ఆడవారు బలహీనులు అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే ఆడవారు బయటకు కనిపించేత బలహీనులు కాదు, వారు లోపలి నుంచి చాలా శక్తివంతులు. పరిశోధనల ప్రకారం, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఆరోగ్యవంతులు, పురుషులకు వచ్చే వ్యాధులతో పోలిస్తే స్త్రీలు జబ్బుపడేది తక్కువ, అంతేకాదు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కాలం జీవిస్తారట. హార్వర్డ్ మెడికల్ యూనివర్శిటీ తాజా అధ్యయనాల ప్రకారం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారని తేలింది. ఇలా ఎందుకు జరుగుతుందో కచ్చితమైన సమాధానం లేనప్పటికీ, స్త్రీలకు ప్రకృతి సిద్ధంగా చేకూరిన కొన్ని అంశాలు వారిని ఎక్కువకాలం జీవించేలా చేస్తున్నాయని వారి స్టడీ విశ్లేషించింది. జీన్-హార్వర్డ్ మెడికల్ వెబ్‌సైట్ ప్రకారం, గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందుతున్నప్పటి నుంచే స్త్రీలు, పురుషులు వేరు అవుతారు.

ఆడ, మగ ఇద్దరూ 23 జతల క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. ఇందులో 23వ జత క్రోమోజోమ్ ఆడవారికి ఒకలా, మగవారికి మరోలా ఉంటుంది. ఆడవారు 23వ జతలో XX క్రోమోజోములను కలిగి ఉండగా, మగవారు XY క్రోమోజోము కలిగి ఉంటారు. ఈ క్రోమోజోములే ఎవరు బలవంతులు, ఎవరి ఆయుర్దాయం ఎక్కువ అనేది నిర్ధారిస్తుంది. మగవారిలో ఉండే Y క్రోమోజోమ్ X క్రోమోజోమ్ కంటే మూడింట ఒక వంతు తక్కువగా ఉంటుంది, తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ Y క్రోమోజోమ్‌లు సులభంగా వ్యాధుల బారినపడటంతో ముడిపడి ఉంటాయి. వ్యాధులబారిన పడి మరణించే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. స్త్రీలలో ఈ Y క్రోమోజోమ్ ఉండదు. వారికి రెండూ XX క్రోమోజోములే కాబట్టి వారికి డబుల్ ఇమ్యూనిటీ ఉంటుంది.

పురుషుల్లోని టెస్టోస్టెరాన్ హార్మోన్ కాలక్రమేణా గుండె కండరాలను ప్రభావితం చేస్తుంది. తద్వారా ఇది మగవారికి అనేక రకాల గుండె జబ్బులకు దారితీస్తుంది. మరోవైపు, మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉంటుంది, ఇది గుండెను రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే, మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉంటాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గుండెను రక్షించే మంచి కొలెస్ట్రాల్ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, స్త్రీలలో మంచి కొలెస్ట్రాల్ సగటున ఒక డెసిలీటర్‌కు 60.3 మిల్లీగ్రాములు ఉండగా, పురుషులలో ఇది 48.5 మాత్రమే ఉంటుంది. ఈ అంశం కూడా మగవారిలోనే ఎక్కువగా ఊబకాయం, గుండె జబ్బులకు కారణం అవుతుంది.

మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణం అయితే, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ కేసులు ఉంటాయి, ఈ విషయంలో పురుషులు కొంతమేర సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ గణాంకాల ప్రకారం పురుషులు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీనికి వారి అలవాట్లు కారణం కావచ్చు. పైవన్నీ ఒకెత్తు అయితే స్త్రీ, పురుషుల జీవనశైలి మరో ఎత్తు. పరిశోధనల ప్రకారం, పురుషులతో పోలిస్తే స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు, ఇంటిపని వంటపనితో వారికి శారీరక శ్రమ లభిస్తుంది, అదనంగా వారు ఏ విషయంలోనూ ఎక్కువ ఒత్తిడికి గురికారు. పురుషుల విషయానికి వస్తే పూర్తిగా భిన్నం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక శ్రమ ఎక్కుగా తీసుకోవడం మొదలైనవన్నీ వారిని త్వరగా పోయేలా చేస్తున్నాయి. కాబట్టి మగవారి కంటే ఆడవారే ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు బల్ల గుద్ది చెబుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker