మగవారు ఖచ్చితంగా ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకంటే..?
వ్యక్తిగతమైన ఒత్తిళ్లను, మరోవైపు వృత్తిపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటూ మానసికంగా కుంగిపోతారు. ఇలా శారీరకంగా, మానసికంగా అలసిపోయి అనేక అనారోగ్యాలను కొనితెచ్చుకుంటారు. కానీ, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగలరు. అయితే ఉరుకులు, పరుగుల జీవితంలో పెద్దగా సమయం కేటాయించరు. ఈ విషయంలో మహిళలతో పోలిస్తే.. పురుషులు మరింత వెనుకబడి ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
యాభై దాటినవారు ఏడాదికోసారి, నలభై దాటినవారు రెండేళ్లకు ఒకసారి.. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్నివిధాలా ఉత్తమం. అయితే బ్లడ్ షుగర్.. ఒబేసిటీ ఉన్నా, కుటుంబసభ్యుల్లో ఎవరికైనా రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉన్నా, వయసు పెరిగేకొద్దీ మధుమేహానికి దగ్గర అవుతున్నట్టే. మధుమేహ కుటుంబ చరిత్ర ఉన్నవారు.. 30 ఏళ్ల నుంచే తరచూ పరీక్షలు చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్.. 35 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి.
తల్లిదండ్రులూ తోబుట్టువులలో డయాబెటిస్, ఒబేసిటీ, గుండెపోటు తదితర సమస్యలతో బాధపడుతున్నవారు, ధూమపాన వ్యసనం ఉన్నవారు.. ఇరవై సంవత్సరాలు దాటినప్పటి నుంచీ అయిదేళ్లకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి. బ్లడ్ ప్రెషర్ (బీపీ).. దేహంలో ప్రవహించే రక్తం.. నాళాలపై కలిగించే ఒత్తిడిని ‘రక్త పీడనం’ అంటారు. ఈ పీడన స్థాయి మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బీపీ పెరగడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. 18 ఏళ్లు పైబడిన వాళ్లు తరచూ బీపీ పరీక్షించుకోవాలి.
ప్రొస్టేట్.. క్యాన్సర్ బారినపడిన ప్రతి ఎనిమిది మంది మగవారిలో ఒకరికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం అధికమని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. 50 ఏళ్లు పైబడిన మగవాళ్లు ఏడాదికోసారి ప్రొస్టేట్ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే 40 ఏళ్ల నుంచే పరీక్షలు ప్రారంభించడం ఉత్తమం. థైరాయిడ్.. శరీరంలో జరిగే జీవ క్రియలన్నిటినీ థైరాయిడ్ హార్మోన్ నియంత్రిస్తుంది.
అలాగే నాడీ వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరులో అసాధారణమైన మార్పులు వస్తే బరువు పెరగడం, ఆయాసం, బరువు తగ్గిపోవడం తదితర మార్పులు కనిపిస్తాయి. పురుషులలో థైరాయిడ్ గ్రంథిలో హెచ్చుతగ్గులు సంతానలేమికి దారితీయవచ్చు. ఇవే కాదు.. గుండె, మూత్రపిండాలు తదితర కీలక భాగాలకు సంబంధించి కూడా తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వీటితోపాటే లైంగిక ఆరోగ్యాన్ని కూడా విస్మరించలేం.