ప్రాణం తీసిన మలబద్ధకం, అలా చేయడం ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై అధిక భారంపడి జీర్ణశక్తి తగ్గుతుంది. ఇది క్రమంగా మలబద్ధకానికి దారితీస్తుంది. మలబద్ధకంవల్ల మలవిసర్జన సరిగా జరగక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే నొప్పి కూడా మొదలవుతుంది. తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. అయితే మలబద్ధకం సమస్య బయటకి చెప్పుకోలేనిది.. అలాగని దాచుకోలేనిది. పొట్టలో తీవ్రమైన అసౌకర్యం కలిగిస్తూ నరకం చూపిస్తుంది. అందుకే పేగు కదలికలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అది ఎంత తీవ్రమైనది అంటే ఒక వ్యక్తి ప్రాణాలు కూడా బలి తీసుకుంది.
అవును మీరు విన్నది నిజమే మలబద్ధకం సమస్య వల్ల 65 ఏళ్ల వ్యక్తి గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. 65 ఏళ్ల వ్యక్తి వారం పాటు తీవ్రమైన మలబద్ధకం సమస్యతో బాధపడి ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఛాతీ నొప్పి, వికారం, టాయిలెట్ రాకపోవడం వల్ల సదరు వ్యక్తి ఒక రోజు హాస్పిటల్ కి వెళ్ళాడు. సుమారు పది రోజుల నుంచి టాయిలెట్ కి వెళ్లలేదని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు డాక్టర్ కి చెప్పాడు. అతడిని కొలంబియాకి చెందిన ఫేమస్ డాక్టర్ రౌడీ రియల్స్ రోయిస్ పరిశీలించారు.
అతడి పరిస్థితి తెలుసుకున్న రోయిస్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ చేశారు. కానీ రోగి హృదయ స్పందన రేటు పెరుగుతూ విపరీతమైన చెమటతో కనిపించాడు. అతనికి గతంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉన్నాయి. దీంతో అతనికి రెక్టల్ ఎనిమా ఇవ్వడం మంచిది కాదని రోయిస్ భావించాడు. దానికి బదులుగా మందులు తీసుకుని మలబద్ధకం సమస్యని తగ్గించేందుకు రోయిస్ చూశాడు. ఎందుకంటే అరుదైన సందర్భాల్లో ఎనిమా చేయడం వల్ల అది మూత్రపిండాలు, గుండెపై ప్రాణాంతకమైన దుష్ప్రభావాలు ప్రేరేపిస్తుంది. కానీ మందులు వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.
మందుల మోతాదుని పెంచారు. బెడ్ కి పరిమితం కాకుండా నడుస్తూ ఉండమని చెప్పాడు. కానీ రోగి మాత్రం డాక్టర్ లేని సమయంలో ఎనిమా చేయించుకోవాలని చాలా పట్టుబట్టాడు. మరొక డాక్టర్ ఆ ప్రక్రియ పూర్తి చేశాడు. దీంతో అతడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఎనిమా చికిత్స ద్వారా రోగి మలం బయటకి పంపడం వల్ల అతడి గుండె ఆగిపోయింది. ఆ ప్రక్రియ వాగస్ నాడిని మీద తీవ్ర ఒత్తిడి కలిగించింది. దీంతో రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయింది. 30 నిమిషాల పాటు అతడిని బతికించేందుకు డాక్టర్ రోయిస్ ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.
మలబద్ధకం వల్ల తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల పురీషనాళం ప్రొలాప్స్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇది పేగు అడ్డంకికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైంది. అటువంటి పరిస్థితిలో హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక్కసారిగా పేగులను ఖాళీ చేయడం వల్ల వాగస్ నాడి దెబ్బతిని ఈ పరిస్థితి తలెత్తుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల గుండె, మెదడు, ఇతర అవయవాలకు తగినంత రక్త ప్రసరణ జరగదు. దీని వల్ల రోగులు గుండె పోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.