బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా..? ఇందులో అసలు నిజం ఇదే.
ఈ బీర్ ను మోతాదులో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా పరిశోధనలే వెల్లడించాలయి. అయితే కొంతమంది బీర్ను తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు రావని కూడా నమ్ముతారు. అలాగే ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే బీర్ ను తాగడం వల్ల అవి కరిగిపోతాయని కూడా నమ్ముతున్నవారున్నారు. అయితే కిడ్నీ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడానికి పని చేస్తుంది. కిడ్నీలో రాళ్ల వల్ల నొప్పి వస్తుంది. చాలా మంది ఆ రాళ్లను తొలగించుకోవడానికి బీరు తాగడం కూడా చేస్తారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి శాస్త్రీయ సమాచారం లేదు. బీర్ ఒక ఆల్కహాలిక్ డ్రింక్.
ఇది తాగితే మూత్రవిసర్జన ఎక్కువ అవుతుంది. దీనిని తాగినప్పుడు సాధారణం కంటే ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. ఇది చిన్న రాళ్లను బయటకు తీయడంలో సహాయపడుతుందని చెబుతారు. అయితే ఇది ఇప్పటివరకు ఏ అధ్యయనంలో నిరూపించబడలేదు. అందుకే డాక్టర్లు రోగికి బీర్ తాగమని సలహా ఇవ్వరు. కిడ్నీలో రాళ్లను తొలగించడానికి బీర్ తాగడం ప్రారంభిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. అది వ్యసనానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎక్కువ బీర్ తాగడం వల్ల మీ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపి.. డీహైడ్రేషన్ కూడా ఏర్పడుతుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. మద్యం ఏ సందర్భంలోనైనా హానికరం. రెగ్యులర్ బీర్ తాగేవారిలో ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేయడం, మూత్రాన్ని తయారు చేయడం కూడా కిడ్నీల పని. ఆహారంలో క్యాల్షియం, పొటాషియం, మినరల్స్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థ పదార్థాలు పూర్తిగా తొలగిపోవు. ఈ వ్యర్థ పదార్థాలు క్రమంగా పేరుకుపోతాయి.
రాళ్ల రూపాన్ని తీసుకుంటాయి. దీనిని వైద్య భాషలో కిడ్నీ స్టోన్ అంటారు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు నీళ్లు ఎక్కువగా తాగాలి. నీళ్లు తాగాలని అనిపించకపోతే కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం వంటి ఇతర మార్గాల్లో లిక్విడ్ తీసుకోవడం పెంచాలని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ స్టోన్ సైజు చాలా పెద్దగా అంటే 5 నుంచి 6 మి.మీ వరకు ఉంటే సర్జరీ ద్వారా దాన్ని తొలగించవచ్చు. శరీరంలో ద్రవం లేదా నీరు లేకపోవడం వల్ల మూత్రం మందంగా మారుతుంది.
దీని వలన అదనపు అవశేష ఉప్పు, కరిగే ఖనిజాలు మూత్రపిండాల లోపలి పొరలో పేరుకుపోతాయి. ఇవి తరువాత రాళ్లను ఏర్పరుస్తాయి. ప్రతి గంటకు 200 మిల్లీలీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి. ఒకేసారి తాగడానికి బదులుగా తక్కువ మొత్తంలో రోజంతా తాగుతూ ఉండాలి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుచేత రోజూ నిమ్మరసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు రాకుండా ఉంటాయి.