వామ్మో, కేదార్‌నాథ్‌లో మరో విపత్తు రానుందా..? ప్రకృతితో ఆటలాడితే అంటే ఉంటుంది.
కేదార్‌నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్‌నాథ్ భారత దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. అయితే అత్యంత సున్నితమైన పర్వత శ్రేణులుగా పేరొందిన హిమాలయాల్లో మళ్లీ అవే తప్పులు జరుగుతున్నాయి. చార్‌ధామ్ పేరుతో ప్రసిద్ధిగాంచిన 4 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతోంది. 2013లో ప్రకృతి సృష్టించిన విళయం కేదార్‌నాథ్ ఆలయం మినహా ఆ మార్గంలో గ్రామాలకు గ్రామాలనే తుడిచిపెట్టేసింది. అంత భారీ విపత్తులోనూ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు.
మనిషి చేస్తున్న దుశ్చర్యలకు దైవం పంపిన హెచ్చరికగా ఆ ఘటన గురించి అప్పట్లో చెప్పుకున్నారు. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నారా అంటే అలాంటిదేమీ లేదని స్పష్టమవుతోంది. సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం ఓ సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నకు అధికారులు ఇచ్చిన సమాచారం చూస్తే విస్తుబోవాల్సిందే. భక్తులు, యాత్రికుల తాకిడి కారణంగా పోగవుతున్న చెత్తను శుద్ధి చేయకుండా అక్కడ సహజసిద్ధంగా ఏర్పడ్డ గుంతల్లో నింపేస్తున్నారని వెల్లడైంది.
సున్నితమైన ఈ ప్రాంతంలో గుంతలను చెత్తతో నింపేయడం పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన పెంచుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పర్యావరణవేత్త అమిత్ గుప్తా రాబట్టిన సమాచారం ప్రకారం 2022-2024 మధ్యకాలంలో కేదార్‌నాథ్ ఆలయ సమీపంలోని రెండు గుంతల్లో మొత్తం 49.18 టన్నుల శుద్ధిచేయని వ్యర్థాలను నింపేశారు. 2022లో 13.20 టన్నులు, 2023లో 18.48 టన్నులు, ఈ ఏడాది ఇప్పటివరకు 17.50 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ వ్యర్థాలను శుద్ధి చేసే వ్యవస్థ ఏదీ కేదార్‌నాథ్‌లో లేదని స్పష్టమైంది.
వీటిని రీసైకిల్ చేస్తున్నామని కేదార్‌నాథ్ నగర్ పంచాయితీ అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ దాఖలాలు అక్కడ కనిపించడం లేదు. అక్కడి సిబ్బంది బాధ్యతారాహిత్యం చెత్తను గుంతల్లో పడేసి నింపేస్తున్నారని అర్థమవుతోంది. అయితే ఇది కేవలం కేదార్‌నాథ్‌కి మాత్రమే పరిమితమైన సమస్య కాదని ఇతర పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కేదార్‌నాథ్ సహా హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి సహా అనేక ఇతర పుణ్యక్షేత్రాల్లో సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.