అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదే. కల్కిలో చూపించిన ఈ ఆలయం మన దగ్గరే ఉందని మీకు తెలుసా..?
బాహుబలి టాలీవుడ్ రేంజ్ ను పెంచేసిన ప్రభాస్ ఇప్పుడు మరోసారి కల్కి సినిమాతో తెలుగు సినిమాను మరో మెట్టు పైకెక్కించాడు మన డార్లింగ్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటించారు. అయితే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి… ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కల్కి సినిమాలో రియల్ లొకేషన్స్ కంటే vfx కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అతితక్కువగా ఒరిజినల్ లొకేషన్స్ లో మూవీని షూట్ చేశారు. అలాంటి రియల్ లొకేషన్స్‌లో ఒకటే ఈ ఆలయం. నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడు గ్రామంలో ఉన్న అతిపురాతన ఆలయం. శతాబ్దాల క్రితం పెన్నా నది ఒడ్డున పరశురాముడు స్వయంగా ప్రతిష్టించిన నాగమల్లేశ్వర స్వామి ఆలయమిది.
కల్కి సినిమాలో అశ్వత్థామగా కనిపించిన అమితాబ్ బచ్చన్ తలదాచుకున్న సీన్ ఈ గుడిలోనే తీయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కల్కి సినిమా విడుదలయ్యాక ఈ గుడికి తాకిడి పెరిగింది. అమితాబ్ ఎంట్రీ ఇక్కడేనంటూ ప్రతిఒక్కరూ వస్తున్నారు. తెగ సెల్ఫీలు తీసుకుంటూ… సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వందల ఏళ్ల తరబడి పూజలకు నోచుకోని ఈ ఆలయం ఇప్పుడు కల్కి మూవీతో సందర్శకులతో రద్దీగా మారింది. ఒకప్పుడు నిత్యపూజలతో విరాజిల్లిన ఈ ఆలయం… కాలగమనంలో దాదాపు 300 సంవత్సరాల క్రితం పెన్నా నదికి వచ్చిన వరదలతో భూగర్భంలో కలిసిపోయింది. అప్పటి నుండి 2020 వరకు ఈ ఆలయం ఊసేలేదు.
ఇక 2020లో ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగమల్లేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది.ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని స్థానికులు నమ్ముతున్నారు. ఇసుక మాఫియా తవ్వకాల్లో ఆలయం అవశేషాలు బయటపడ్డ విషయం… గ్రామ పెద్దలకు తెలియడంతో వారు గుడి చుట్టు తవ్వకాలు జరిపారు. దీంతో ఆలయం బయటపడింది. అప్పటి నుంచి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా విడుదలైన కల్కి సినిమాలో ఈ ఆలయం గోపురం.. గోపురం లోపల భాగాలు సినిమాలో ఉన్నాయి. అమితాబ్ పోషించిన అశ్వద్దామ పాత్ర ఎంట్రీ సీన్ ఈ ఆలయ గోపురం నుంచి ఉంటుంది. దీంతో జిల్లాలో ఉన్న వారంతా ఇపుడు ఆలయాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి కూడా యువకులు వచ్చి ఇక్కడ రీల్స్, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా కల్కి మూవీతో నెల్లూరు జిల్లాలోని నాగేశ్వర స్వామి పురాతన ఆలయం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.
Somewhere deep inside the Nellore district in Andhra Pradesh. pic.twitter.com/AwGV5vzFGX
— Lost Temples™ (@LostTemple7) July 29, 2023