సినీ నటి జయప్రద మిస్సింగ్.. పోలీసులు గాలింపులు, ఏం జరిగిందో తెలుసా..?
జయప్రద..తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఎంపీగా సేవలందించారు. అది అలా ఉంటే ఆమె మిస్సింగ్ అయ్యినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉండగా.. జయప్రద కోర్టుకు హాజరు కాలేదు.
ఈ అంశంపై ప్రోసక్యూషన్ ఆఫీసర్ అమర్‌నాథ్ తివారీ మాట్లాడుతూ.. జయప్రదకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా ఆమె నవంబర్ 8న కోర్టుకు హాజరు కాలేదన్నారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది ఆ సమయంలో కూడా ఆమె కోర్టు రాలేదు. ఆపై డిసెంబర్ నెలలో హాజరు కావాలని హెచ్చరించినా కూడా ఆమె అందుబాటులోకి రాలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంది.
జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రామ్‌పూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోతుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. జయప్రద కోసం పోలీసులు ముమ్మరంగా వెతికే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన జయప్రద.. సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
కేసు ఏంటి..2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరఫున రాంపూర్ నుంచి జయప్రద బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లో ఉంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె రాకపోవడంతో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.