డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం, మీరెళ్లిపోతారా..అంటూ ఇండియన్స్ కి ట్రంప్ వార్నింగ్.!
వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యూఎస్ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే.. తన విజయంలో కీలక భూమిక పోషించిన వారికి ట్రంప్ కీలక పదవులు అప్పగిస్తున్నారు. అయితే అసలే ఆయన ట్రంప్… ఎదైనా అనుకున్నారంటే అది అయిపోవాల్సిందే. మాములుగానే ఆయనతో మామూలుగా ఉండదు… ఇక తనను గెలిపించిన వలసదారుల తరిమివేత అంశంలో ఆయన ఊరుకుంటారా…? ఇప్పటికే ఆయన తన ప్లాన్ మొదలుపెట్టేసినట్లు కనిపిస్తోంది. అధికారానికి ఇంకా రెండు నెలలకు పైగానే టైమున్నా ఇప్పట్నుంచే వలసదారుల గుండెల్లో మిస్సైళ్లను బలంగా పేలుస్తున్నారు.
వలసదారుల కంటే ముందు భారతీయుల గుండెల్లో ట్రంప్ మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి రాగానే ఫస్ట్‌డేనే నాచ్యురలైజ్డ్ సిటిజన్‌షిప్‌పై పడనున్నారు. అంటే ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం అమెరికాలో ఎవరైనా పుడితే సహజంగానే వారు ఆ దేశ పౌరులైపోతారు. తల్లితండ్రి ఎక్కడివారు అన్నదాంతో సంబంధం లేదు. అమెరికా గడ్డపై పుడితే చాలు ఆ దేశ పౌరుడైపోతారు. చాలామంది విదేశీయులు అమెరికాలో పిల్లల్ని కనడానికి అందుకే ఉత్సాహం చూపేవారు. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఆ రూల్‌ను పక్కన పెట్టబోతున్నారు. తల్లి లేదా తండ్రిలో ఒకరు కచ్చితంగా అమెరికా జాతీయుడు లేదా చట్టబద్దంగా అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలన్న రూల్ తీసుకు రాబోతున్నారు.
మన భారతీయుల్లో ఎక్కువ మంది ఉద్యోగాల కోసం అమెరికాలో ఉంటూ అక్కడే పిల్లల్ని కనేవారు. దీంతో వారు అమెరికా పౌరులై పోయేవారు. ఒకవేళ్ల తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ రాకపోయినా డిపెండెంట్ హోదాలో అమెరికాలో ఉండటానికి పెద్దలకు అవకాశం ఉండేది. చాలామంది భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం అప్లయ్ చేసుకున్నా వారి జీవితకాలంలో అది అందడం లేదు. అమెరికాలో ఇప్పటికి దాదాపు 10లక్షలమందికి పైగా భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారందరికీ ఈ నాచ్యురలైజ్డ్ సిటిజన్ షిప్ వరంలా ఉండేది. కానీ ట్రంప్ దానికి గండి కొట్టబోతున్నారు.
అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అమెరికాలో ఉద్యోగం చేస్తూ పిల్లల్ని కన్నా ఉపయోగం ఉండదు. ఇది భారతీయులను దెబ్బతీసేదే. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తానని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఇది అమెరికా రాజ్యంగంలోని 14వ అధికరణకు వ్యతిరేకం అన్నది నిపుణుల మాట. దీనిపై న్యాయపోరాటాలు జరిగే అవకాశం ఉంది. అయినా సరే అక్కడ ఉన్నది ట్రంప్. ఆయన ఏం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.