HPV వ్యాక్సిన్ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు కూడా వేసుకోవాలి, ఎందుకో తెలుసా..?
రొమ్ము క్యాన్సర్ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్ కాబట్టి . భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకి ఓ మహిళ గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు అంచనా, అధిక మరణాల రేటుకి ప్రధాన కారణం ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించకపోవడమే. అయితే గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించే హ్యూమన్ పాపిల్లోమావైర్స్ (HPV) వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకేనా అంటే కచ్చితంగా కాదు అంటున్నారు నిపుణులు.
సాధారణంగా గర్భాశయ క్యాన్సర్ అంటే కేవలం అమ్మాయిలకి మాత్రమే అనే భ్రమలో ఉంటున్నారని.. ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా వేయాలని చెప్తున్నారు. 2006లో తొలిసారిగా HPV వ్యాక్సిన్‌ని ఆమోదించారు. 9 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు దీనిని ఇచ్చేవారు. అయితే 2009లో అబ్బాయిల కోసం HPV టీకాను ఆమోదించారు. HPV టీకాను అబ్బాయిల కూడా వేయించుకోవాలి అంటున్నారు ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తొమ్మిది రకాల HPVలను కవర్ చేస్తుంది.
కాబట్టి గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం లేని అబ్బాయిలు కూడా ఈ టీకాను వేయించుకోవాలి అంటున్నారు. HPV అనేది లైంగిక సంక్రమణ. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌కు, పురుషులలో పురుషాంగ క్యాన్సర్.. స్త్రీ, పురుషులలో గొంతు, నాలుక, టాన్సిల్ క్యాన్సర్లకు కారణమవుతుంది. వీటి లక్షణాలు త్వరగా బయటపడవు. వైరస్‌కు గురైన కొన్నేళ్లకు ఇవి బయటపడవచ్చు. అవి ప్రాణాంతకం కూడా అవుతాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ బాలురు, బాలికలకు వేయిస్తే వారిని ఈ క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
HPV సంబంధిత క్యాన్సర్ వచ్చే ప్రతి 10 కేసులలో నలుగురు మగవారు ఉంటున్నారు. ప్రస్తుతం పురుషులలో ఈ క్యాన్సర్లకు స్క్రీనింగ్ లేదు. చికిత్స కూడా లేదు. కాబట్టి వ్యాక్సిన్‌తో మాత్రమే ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చు. HPV టీకాను 9 నుంచి 26 సంవత్సరాల ఉన్న స్త్రీ, పురుషులందరికీ సిఫార్సు చేస్తున్నారు. మొదటి డోస్ నుంచి రెండో డోస్‌కి 6 నుంచి 12 నెలల తేడా ఉంటుంది.
HPV వ్యాక్సిన్ క్యాన్సర్ నిరోధక ప్రయోజనాలు అందిస్తుంది. వీటిని అన్నిరకాలుగా పరీక్షలు చేసిన తర్వాతే టీకాగా అందిస్తారు. కాబట్టి ప్రతికూల చర్యలు ఏమి ఉండవు. జలుబు, ఫ్లూ వంటి వాటికి తీసుకునే వ్యాక్సిన్ల మాదిరిగానే.. దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నొప్పి, ఎరుపు, వాపు, కందడం వంటివి జరుగుతాయి అంతే. అవి కూడా తీవ్రమైనవి కావంటూ తెలిపారు. HPV టీకాను లైంగికంగా పాల్గొనకముందే ఇస్తే చాలా మంచిది. ఒకవేళ లైంగికంగా చురుకుగా ఉన్నా.. ఈ టీకా వైరస్ల నుంచి రక్షించగలదు.