గుండెపోటుతో భర్త మృతి, అది తట్టుకోలేక ఏడో అంతస్తు నుంచి దూకి భార్య ఆత్మహత్య.
ఘజియాబాద్ వైశాలి ప్రాంతానికి చెందిన అభిషేక్ (25), అంజలికి గతేడాది నవంబర్ 30న వివాహమైంది. ఈ కొత్త జంట సోమవారం నాడు సరదాగా బయటకు వెళ్లాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. అక్కడ కాసేపు ఇద్దరూ సరదాగా గడిపారు. అనంతరం కాసేపటికి అభిషేక్‌కి ఛాతిలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డాడు. అయితే 25 ఏళ్ల అభిషేక్ అహ్లువాలి గుండెపోటుతో మరణించగా, అతని భార్య అంజలి షాక్ తట్టుకోలేక ఏడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
గతేడాది నవంబర్ 30న ఇద్దరికి వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం వీరిద్దరు ఢిల్లీలోని జూ కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అభిషేక్‌కి ఛాతిలో నొప్పి అనిపించిందని, అంజలి తన స్నేహితులను సాయంతో అతడిని గురు తేజ్ బహదూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించింది. దురదృష్టవశాత్తు అభిషేక్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గుండె పోటు కారణంగా అతడు మరణించినట్లు వెల్లడించారు.
రాత్రి సమయంలో ఘజియాబాద్ వైశాలిలోని అహ్ల్కాన్ అపార్ట్మెంట్‌కి మృతదేహం చేరుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక అంజలి ఏడో అంతస్తులోని బాల్కానీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాలైన ఆమెను వైశాలిలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించించారు, చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున అంజలి మరణించింది. అభిషేక్ శవం పక్కనే కూర్చుని ఏడుస్తూ, వెంటనే బాల్కనీ వైపు పరిగెత్తిందని, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించేలోపే కిందకు దూకిందని బంధువులు వెల్లడించారు.
ఇటీవల కాలంలో యవతలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తులు హఠాత్తుగా కుప్పకూలుతున్నారు. 30 ఏళ్ల పూర్తి కాకముందే గుండెపోటులకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. వివాహ వేడుకల్లో, గర్బా కార్యక్రమాల్లో ఉన్నట్టుండి యువకులు గుండెపోటుకు గురైన ఘటనలు ఇటీవల కాలంలో చూశాం. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.