Health

స్మార్ట్ వాచ్‌తో ఆ భయానక వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చు. ఆ వెంటనే..?

నేటి కాలంలో చాలా మంది వ్యక్తులు రోజంతా తమ కంప్యూటర్ల ముందు కూర్చుంటారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా వహించరు. వాస్తవానికి ఈ కాలంలో ప్రజలు టీవీ, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఆరోగ్యానికి కాస్త కూడ సమయం వెచ్చించట్లేదు. అయితే మెదడు, నాడి వ్యవస్థకు చేటు చేసే భయానక పార్కిన్సన్స్ వ్యాధిని కూడా స్మార్ట్ వాచ్ ద్వారా ముందుగానే గుర్తించి తగిన చికిత్సను అందుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూడండి. వ్యాధిని ముందుగా గుర్తించడం జరిగితే.. అది ముదరకుండానే చికిత్స ప్రారంభించడం సులభం అవుతుంది.

కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సింథియా సాండోర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘స్మార్ట్ వాచీల వినియోగం వల్ల రోజులో ఎన్ని అడుగులు నడిచాం? ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశాం? గుండె వేగం వంటివి మాత్రమే కాదు పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను కూడా చాలా ముందుగానే పసిగట్టడం సాధ్యమవుతుంది’’ అని తెలిపారు. స్మార్ట్ వాచీల ధరలు కూడా తక్కువే కనుక పార్కిన్సన్స్ వ్యాధిని ముందుగా గుర్తించే విధంగా.. స్క్రీనింగ్ కు అనువుగా వీటిని తయారు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

స్మార్ట్ వాచ్ కలిగిన వ్యక్తి కదలికను గణించడం ద్వారా వారిలో పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది గుర్తించవచ్చని పేర్కన్నారు. పార్కిన్సన్స్ అనేది బ్రెయిన్ డిజార్డర్. ఈ సమస్యలో అసంకల్పితంగా శరీరంలో వణుకు రావడం, కదలికలు నెమ్మదించడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని నివారించడం దాదాపు సాధ్యం కాదనే చెప్పాలి. చికిత్సలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. రోజురోజుకు లక్షణాలు తీవ్రంగా మారి రోజువారి పనుల నిర్వహణ కూడా కష్టంగా మారుతుంది.

లక్షణాలు చిన్నగా మొదలవడానికి ముందుగానే గుర్తించగలిగితే తగిన ఆహారం, వ్యాయామం, ఫిజియోథెరపీ, కొన్ని మందులతో ఆ వ్యాధి త్వరగా ముదరకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది స్మార్ట్ వాచీలను ఉపయోగిస్తున్నారు. ఈ వాచీలు హృదయస్పందన, యాక్టివిటీ లెవెల్స్, నిద్ర, అడుగుల లెక్క వంటివన్నీ గణిస్తుంది. నేచర్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఈ వాచీలను పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా తయారుచేయడం సాధ్యమేనా అనే విషయం గురించి చర్చించారు. దీని కోసం దాదాపుగా 1,03,000 మంది స్మార్ట్ వాచీలు ధరించే వారి డేటాను ట్రాక్ చేశారు.

ఇలా స్మార్ట్ వాచ్ ధరించిన ఒకరిలో పార్కిన్సన్స్ వ్యాధిని ఉన్నట్లు తెలుసుకున్నారు. వారంలో ఆమె కదలికల్లో వచ్చిన మార్పును కచ్చితంగా అంచనా వెయ్యడం ఈ డివైజ్ ద్వారా సాధ్యపడింది. పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు బయటపడి నిర్ధారణ జరిగేనాటికే మెదడులోని చాలా కణాలు ప్రభావితమై ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్ వాచీల డేటా వ్యాధిని ముందుగా గుర్తించడంలో సహాయపడే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. పార్కిన్సన్స్‌ను ముందుగా గుర్తిస్తే వ్యాధి ముదిరే కాలాన్ని వాయిదా వెయ్యడానికి అవసరమయ్యే చర్యలు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker